Begin typing your search above and press return to search.

కార్పొరెట్ విద్యా సంస్థ‌కు బ‌న్ని ప్ర‌మోట‌ర్

By:  Tupaki Desk   |   16 Oct 2021 4:43 AM GMT
కార్పొరెట్ విద్యా సంస్థ‌కు బ‌న్ని ప్ర‌మోట‌ర్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గ‌తంలో ఎన్నో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించారు. కోలా కంపెనీలు .. మ్యాంగో బేవ‌రేజెస్ స‌హా ప‌లు ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఓ కార్పొరెట్ విద్యా సంస్థ‌ను అనుబంధంగా ఉన్న‌ కోచింగ్ సెంట‌ర్ల‌ను ప్ర‌మోట్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలంగాణ లో విద్యా రంగంలో ఎదురేలేని సంస్థ‌గా పాపుల‌రైన శ్రీ‌చైత‌న్య‌కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. దశాబ్దాలుగా శ్రీ‌చైత‌న్య‌ విద్యా సంస్థ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో టాప్ ర్యాంకర్లను అందించింది. 1986 నుంచి ద‌శాబ్ధాలుగా ఈ సంస్థ మ‌నుగ‌డ సాగిస్తోంది. తాజా ప్ర‌క‌ట‌న‌లో ``ఐఐటి సక్సెస్ కోసం శ్రీ చైతన్య బెస్ట్`` అంటూ బ‌న్ని ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప్ర‌క‌ట‌న‌లో అతను కాలేజీ విద్యార్థులతో కనిపించ‌డం విశేషం. ``మీ సక్సెస్ కోసం శ్రీ చైతన్య ని ఎంచుకోవడం లో మాత్రం తగ్గేదే లే`` అంటూ బ‌న్ని ప్ర‌మోట్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. శ్రీ చైతన్య ఇలా ఒక సినీస్టార్ తో ప్ర‌చారం చేయించ‌డం కూడా ఇదే తొలిసారి. విద్యా రంగంలో అల్లు అర్జున్ మొదటి వాణిజ్య ప్రకటన ఇది.

సినీకెరీర్ లో ఎదురేలేని స్టార్ డ‌మ్

మ‌రోవైపు స్టార్ హీరోగా బ‌న్ని బిజీ షెడ్యూల్స్ గురించి తెలిసిందే. కొంత‌కాలంగా పుష్ప చిత్రీక‌ర‌ణ‌లో అత‌డు బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. పుష్ప చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ డిసెంబర్ లో విడుదలవుతుంది. `పుష్ప-డ్యూయాలజీ` పై తొలి నుంచి భారీ అంచనాలున్నాయి. బన్నీని నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కించే ఫ్రాంఛైజీగా నిలిచిపోతుందని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. స్టైలిష్ టిఫికల్ ఫిలిం మేకర్ సుకుమార్ పుష్ప చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో బహుభాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు- తమిళం- మలయాళం- కన్నడం- హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. రెండు భాగాల ఫ్రాంచైజీలో మొదటి భాషం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ నేపథ్యంలో పార్ట్ -1 ఈ ఏడాది క్రిస్మ‌స్ కానుకగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక గిరిజన యువతి పాత్రలో రష్మిక కనిపించనుందని యూనిట్ రివీల్ చేసింది. ఇప్పటికే ఈ రెండు పాత్రల ఫస్ట్ లుక్ లు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో వివాహిత గా గృహిణిగా రష్మిక కనిపించనుందని చాలా కాలంగా క‌థ‌నాలొస్తున్నాయి. అంటే పుష్పరాజ్- రష్మిక భార్యాభర్తలుగా కనిపిస్తారని టాక్ ఉంది. దానికి త‌గ్గ‌ట్టే తాజా లుక్ ని రివీల్ చేశారు సుకుమార్. అలాగే ఇందులో విల‌న్ గా న‌టిస్తున్న ఫ‌హ‌ద్ ఫాజిల్ లుక్ కూడా ఆక‌ట్టుకుంది. క‌మెడియ‌న్ సునీల్ ఇందులో మ‌రో విల‌న్ గా క‌నిపిస్తార‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి.


ఇక బ‌న్ని-ర‌ష్మిక జంట మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతే హైలైట్ గా ఉంటాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. పూర్తిగా చిత్తూరు మాండలికంలో నే రెండు పాత్రలు మాట్లాడుతాయి. ఆ శైలికి ఎంత మాత్రం తగ్గకుండా మాస్ కోణంలో ఆద్యంతం పాత్రలు రక్తికట్టిస్తాయని తెలుస్తోంది. ఇటీవలే రిలీజైన నారప్ప చిత్రంలో నెల్లూరు-చిత్తూరు యాస ప్రేక్షకాభిమానుల్ని ఆకట్టుకుంది. పుష్పలో ఈ యాస పాళ్లు మరింత అదనపు ఆకర్షణ కానున్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా నాయకానాయికలే చిత్తూరు యాసతో అదరగొట్టడం ఫ్యాన్స్ కి ఓ రేంజులోనే కనెక్ట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీ‌వ‌ల్లిగా ర‌ష్మిక గ్లామ‌ర‌స్ యాంగిల్ మ‌రో ప్ర‌ధాన ఆకర్ష‌ణ కానుంది. అసలు తగ్గేదేలే అంటూ పుష్ప క్రిస్మ‌స్ బ‌రిలో వ‌స్తోంది. డిసెంబర్ లో పుష్ప 1 రిలీజ్ ఖాయ‌మైంది. సంక్రాంతి 2022 బరిలో తీవ్రమైన పోటీ కారణంగా పుష్పను సోలో రిలీజ్ చేస్తున్నారు.