Begin typing your search above and press return to search.

రేటు పెంచేసిన బన్నీ..? AAA కాంబోపై లేటెస్ట్ బజ్..?

By:  Tupaki Desk   |   21 Jan 2022 6:13 AM GMT
రేటు పెంచేసిన బన్నీ..? AAA కాంబోపై లేటెస్ట్ బజ్..?
X
సౌత్ స్టార్ హీరో అల్లు అర్జున్ దృష్టంతా ఇప్పుడు పాన్ ఇండియా మీదే ఉంది. తన కెరీర్ లో ఫస్ట్ మల్టీలాంగ్వేజ్ మూవీగా వచ్చిన 'పుష్ప: ది రైజ్' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టింది. సినీ అభిమానులతో పాటుగా సెలబ్రిటీలు సైతం పుష్పరాజ్ పై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందనేది పక్కన పెడితే ఈ సినిమాతో బన్నీ సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.

'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ ఇకపై అన్నీ పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథలనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న 'పుష్ప: ది రూల్' చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీని తర్వాత ఇటీవల అఖండమైన విజయం అందుకున్న బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయాలని చూస్తున్నారు.

ఈ క్రమంలో బన్నీ చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే 'పుష్ప' పార్ట్-1 చిత్రాన్ని తమిళ్ లో రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు అల్లు అర్జున్ తో ఓ మూవీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్ట్ కు హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టాక్ నడుస్తోంది.

అంతేకాదు 'పుష్ప' తో పాన్ ఇండియా పాపులారిటీ తెచ్చుకున్న బన్నీ.. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 75 కోట్ల రెమ్యూనరేషన్ అడిగారట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. అందుకు లైకా సంస్థ కూడా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని టాక్. ఇప్పటికే అట్లీ అండ్ టీమ్ బన్నీ కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారని.. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్ ని తీసుకోబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌ ని డైరెక్ట్ చేస్తున్న అట్లీ.. బన్నీతో చర్చలు జరిపారా లేదా.. ఒకరినొకరు కలుసుకున్నారా? అనేది ప్రస్తుతానికి అస్పష్టంగా ఉంది. ఏదేమైనా AAA (అల్లు అర్జున్ - అట్లీ - అనిరుద్) కలయిక చాలా ఎక్సైటింగ్‌ గా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చితే బాగుంటుందని బన్నీ అభిమానులు కోరుకుంటున్నారు. మరి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూద్దాం.