Begin typing your search above and press return to search.

థియేటర్ బిజినెస్ లోకి బన్నీ.. 'AAA' సినిమాస్ కు శ్రీకారం..!

By:  Tupaki Desk   |   6 Nov 2021 11:30 AM GMT
థియేటర్ బిజినెస్ లోకి బన్నీ.. AAA సినిమాస్ కు శ్రీకారం..!
X
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వ్యాపారం మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆహా ఓటీటీ మరియు గీతా ఆర్ట్స్ వ్యవహారాలతో పాటుగా అల్లు స్టూడియో నిర్మాణ పనులను బన్నీ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు థియేటర్ బిజినెస్ లో ఎంటర్ అవుతున్నారు.

ఏషియన్ సినిమాస్ గ్రూప్ తో కలసి అల్లు అర్జున్ థియేటర్ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. సరికొత్త టెక్నాలజీతో హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ థియేటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 'AAA' (ఏషియన్ అల్లు అర్జున్) సినిమాస్‌ పేరుతో నిర్మించబడుతున్న ఈ మల్టీప్లెక్స్ కు ఈరోజు శనివారం బన్నీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ - నారాయణదాస్ నారంగ్ - భరత్ నారంగ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఏషియన్ గ్రూప్ వారు ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గచ్చిబౌలిలో AMB సినిమాస్ (ఏషియన్ మహేష్ బాబు) పేరుతో ప్రపంచ స్థాయి హంగులతో ఓ థియేటర్‌ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తో కలసి ఏషియన్ గ్రూప్‌ మహబూబ్ నగర్‌ లో AVD సినిమాస్ (ఏషియన్ విజయ్ దేవరకొండ) మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పుడు అల్లు అర్జున్ తో 'AAA' సినిమాస్ కు శ్రీకారం చుట్టారు. ఈ థియేటర్ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ''పుష్ప'' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ ని డిసెంబర్ 17న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.