Begin typing your search above and press return to search.

'రౌడీ బాయ్స్' ని రాంగ్ టైంలో తీసుకొస్తున్నారా..?

By:  Tupaki Desk   |   3 Jan 2022 6:18 AM GMT
రౌడీ బాయ్స్ ని రాంగ్ టైంలో తీసుకొస్తున్నారా..?
X
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా లాంచ్ అవుతున్న చిత్రం ''రౌడీ బాయ్స్''. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఆశిష్ సరసన మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలుపుతున్నారు.

'రౌడీ బాయ్స్' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - టీజర్ - టైటిల్ సాంగ్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మంచి తేదీ కోసం వేచి చూస్తున్న మేకర్స్.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు పండగ రేసులో నుంచి తప్పుకోవడంతో ఆశిష్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టిన 'రౌడీ బాయ్స్' టీం.. తాజాగా సినిమాలోని 'బృందావనం' అనే సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. 'బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే.. రాధను చూసాడే.. ఫ్లూటు లేని గోపాలుడే.. సూటు వేసే భూపాలుడే..' అంటూ ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన పెప్పీ నంబర్ తో ఆడియన్స్ కాలు కదిపేలా చేసారు.

ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ ఈ గీతానికి సాహిత్యం అందించగా.. గాయని మంగ్లీ తనదైన శైలిలో హుషారుగా ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రపీ చేసిన ఈ సాంగ్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాస్ స్టెప్పులు ఆకట్టుకుంతున్నాయి. అనుపమ కాలేజ్ ఫస్ట్ లో భాగంగా స్టేజీ మీద పెర్ఫర్మ్ చేస్తుండగా.. ఆశిష్ ఆమె డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయడం ఈ పాటలో కనిపిస్తోంది.

కాగా, 'రౌడీ బాయ్స్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ పుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారని తెలుస్తోంది. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల కంటెంట్ చూసి ఆశిష్ కు మంచి డెబ్యూ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కాకపోతే రాంగ్ టైములో రిలీజ్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కరోనా నేపథ్యంలో ప్రస్తుతం జనాలు పెద్ద హీరోల సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.. చిన్న హీరోల సినిమాలను ఓటీటీ వేదికల్లో చూద్దామనే ధోరణిలో ఉన్నారు. గత కొన్ని నెలలుగా విడుదలైన సినిమాల జాబితాను.. సక్సెస్ అయిన చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థం అవుతుంది. ఇప్పుడు సంక్రాంతి సీజన్ లో డేట్ దొరికిందని చిన్న సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేసినప్పటికీ.. ప్రేక్షకులను సినిమా హాళ్ల వరకు తీసుకురావడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరి ఇప్పుడు దిల్ రాజు ఫ్యామిలీ హీరోని పరిచయం చేస్తున్న 'రౌడీ బాయ్స్' సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ఆశిష్ - అనుపమ లతో పాటుగా సాహిదేవ్ విక్రమ్ - కార్తీక్ రత్నం - తేజ్ కూరపాటి - కోమలీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మధే సినిమాటోగ్రఫీ అందించిన ఈ మూవీకి రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్ గా.. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మధు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.