Begin typing your search above and press return to search.

ఊపిరి బిగబట్టి చూసే సీన్ అది: రాజమౌళి

By:  Tupaki Desk   |   8 Feb 2022 10:46 AM GMT
ఊపిరి బిగబట్టి చూసే సీన్ అది: రాజమౌళి
X
రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరి దృష్టి ఆ వైపే ఉంటుంది. ఆ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా .. ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. ఇక ఆయన ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోల అభిమానులంతా కూడా కొత్త రికార్డులు తమ హీరో సొంతమైనట్టేననే భరోసాతో ఉంటారు. ఈ సినిమా చూడటం కోసం ఇంత ఖర్చు చేయాలా? అని ఆయన సినిమాకి వెళ్లేవారు ఎవరూ అనుకోరు. ఇక్కడే రాజమౌళి అసలైన సక్సెస్ ను సాధించారు. తన సినిమాపై ఆయన ప్రేక్షకులకు బలమైన నమ్మకాన్ని కలిగించారు.

ఆయన తాజాగా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' సిద్ధమవుతోంది. కరోనా కారణంగా ఇప్పటికే కొన్ని సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాంతో అందరి ఫోకస్ ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది. ఈ రిలీజ్ డేట్ కోసం అందరూ ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' .. 'బాహుబలి 2' తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా ఇది. ఆ రెండు సినిమాలు కూడా ప్రపంచపటంపై తెలుగు సినిమా జెండాను ఎగరేశాయి. అందువలన 'ఆర్ ఆర్ ఆర్' పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

ఈ సినిమాను గురించి రాజమౌళి మాట్లాడుతూ .. "ఈ సినిమా సెకండాఫ్ లో ఒక యాక్షన్స్ సీక్వెన్స్ ఉంటుంది. ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరిపైనా ఈ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించడం జరిగింది. ఆ సీన్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అందరూ కూడా ఊపిరిబిగబట్టి చూస్తారు. ఎవరి గుండె చప్పుడు వాళ్లకి వినపడేలా ఆ సీన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ సీన్ చూస్తూ ఎమోషన్ కి లోనవుతారు. ఈ ఒక్క సీన్ కోసమైనా ఈ సినిమా చూడొచ్చునని అనుకుంటారు.

ఈ సన్నివేశంలో ఎన్టీఆర్ - చరణ్ యాక్టింగ్ హ్యాట్సాఫ్ అనేలా ఉంటుంది. ఇద్దరూ కూడా అంత గొప్పగా చేశారు. ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా చేశారు. ఇద్దరి కెరియర్లోను ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోతుంది. వారి అభిమానులు గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. ఇండస్ట్రీలో ఈ సినిమాను కొంతమంది ప్రముఖులకు చూపించినప్పుడు వాళ్లందరూ కూడా ఇదే మాట అన్నారు. ఇది ప్రయోగమా? సాహసమా? అని చాలామంది అడుగుతున్నారు. సాహసంతో కూడిన ప్రయోగమని నేను చెబుతున్నాను" అని అన్నారు.

డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇంతవరకూ వదిలిన ప్రతి పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఉత్తరాదిన .. దక్షిణాదిన చాలా క్రేజ్ ఉన్న ఆర్టిస్టులతో పాటు, హాలీవుడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో నటించారు. ఇంతవరకూ అల్లూరిని .. కొమరం భీమ్ లను సినిమాలో చూస్తూ వచ్చిన ప్రేక్షకులకు, ఈ సినిమాలో వాళ్లు కొత్తగా కనిపిస్తున్నారు. వాళ్ల పాత్రలను రాజమౌళి మలిచిన తీరును చూడటానికి అంతా ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఓపెనింగ్స్ తోనే ఈ సినిమా రికార్డుల వేట మొదలుకావొచ్చుననే టాక్ బలంగా వినిపిస్తోంది.