Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘బ్రహ్మోత్సవం’

By:  Tupaki Desk   |   20 May 2016 9:29 AM GMT
మూవీ రివ్యూ: ‘బ్రహ్మోత్సవం’
X
చిత్రం: ‘బ్రహ్మోత్సవం’

నటీనటులు: మహేష్ బాబు - కాజల్ - సమంత - ప్రణీత - సత్యరాజ్ - రావు రమేష్ - జయసుధ - రేవతి - నరేష్ - కృష్ణభగవాన్ - షాయాజి షిండే - తనికెళ్ల భరణి - వెన్నెల కిషోర్ - ముకేష్ రుషి - బేబి అక్షర తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
నేపథ్య సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: రత్నవేలు
నిర్మాతలు: పెర్ల్ వి.పొట్లూరి-పరమ్ వి.పొట్లూరి-కవిన్ అన్నె
రచన-దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల

బ్రహ్మోత్సవం.. పేరు దగ్గర్నుంచి ఇందులోని ప్రతి అంశమూ ప్రేక్షకుల్ని ఆకర్షించిందే. మొదలైన నాటి నుంచి ప్రేక్షకుల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగిస్తూ వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజే విడుదలైంది. మరి ‘బ్రహ్మోత్సవం’ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అనగనగా ఒక పెయింటింగ్ కంపెనీ యజమాని (సత్యరాజ్). ఎంతో కష్టపడి పైకి వస్తాడు. 400 రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టి 400 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే స్థాయికి తన కంపెనీని తీసుకెళ్తాడు. తన భార్య అన్నయ్యలు నలుగురిని.. వారి కుటుంబాల్నీ చేరదీసి వారికి అన్నీ తానై ఉంటాడు. ఎప్పుడూ తన చుట్టూ నలుగురు మనుషులుండాలనేది అతడి తాపత్రయం. ఐతే అతడి బావమరుదుల్లో ఒకరు (రావు రమేష్) అతణ్ని అపార్థం చేసుకుంటాడు. తన బావ కింద బతకడం ఇష్టం లేక అతను రగిలిపోతుంటాడు. తన కూతుర్ని అతడి కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ ఆ కొడుకు (మహేష్ బాబు) మరో అమ్మాయితో కలిసి తిరగడం తట్టుకోలేకపోతాడు. ఓ సందర్భంగా తండ్రీ కొడుకులిద్దరినీ తిట్టిపోస్తాడు. ఆ మాటలకు తట్టుకోలేక ఆ తండ్రి ప్రాణం వదిలేస్తాడు. అప్పుడా కొడుకు తన మావయ్యలోని అపార్థాన్ని తొలగించి.. తన తండ్రి గొప్పదనమేంటో అతడికి తెలియజేసే ప్రయత్నమే మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కొన్నిసార్లు ఔట్ డేటెడ్ అయిపోయాయి అనుకున్న కొన్ని కథలు.. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ‘ట్రెండీ’ అయిపోతుంటాయి. ఒకప్పుడు తెలుగు సినిమాకు ఆధారంగా నిలిచి.. ఆ తర్వాత పక్కకు వెళ్లిపోయిన కుటుంబ కథలు ఇప్పుడు మళ్లీ తెలుగు తెరపై రాజ్యమేలుతుండటం విశేషమే. ఫ్యామిలీ డ్రామాలకు ఈ ఊపు రావడానికి శ్రీకాంత్ అడ్డాల తీసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కూడా ఒక రకంగా కారణం. స్టార్ హీరోల్ని కుటుంబ కథలోకి తీసుకొచ్చి.. ప్రేక్షకులు ఊహించని ఒక సింపుల్ స్టోరీని తనదైన శైలిలో చెప్పి మెప్పించాడు శ్రీకాంత్ అప్పట్లో. ఐతే అప్పుడు ప్రేక్షకుల అంచనాల్ని మించి పనితనం చూపించిన అడ్డాల.. ఈసారి ‘బ్రహ్మోత్సవం’ విషయంలో అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయాడు.

శ్రీకాంత్ అడ్డాల కథలన్నీ విలువల పాఠాల చుట్టూనే తిరుగుతుంటాయి. ‘బ్రహ్మోత్సవం’ కూడా ఆ కోవలోని సినిమానే. చుట్టూ నలుగురు మనుషులుంటేనే ఏ మనిషి జీవితమైనా సంతోషంగా సాగుతుందని చెప్పే ప్రయత్నం చేశాడు శ్రీకాంత్. ఈ క్రమంలో మన మూలాలు వెతుక్కునే కాన్సెప్ట్ తెచ్చి ఇరికించాడు. ఐతే ఈ ఉపకథను ప్రధాన కథతో ముడిపెట్టడంలో.. ప్రేక్షకుడిలో ఎమోషన్ తీసుకురావడంతో అతను సక్సెస్ కాలేకపోయాడు. మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నా ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడంతో ‘బ్రహ్మోత్సవం’ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకు చేరే అవకాశం లేకపోయింది.

దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలది ప్రత్యేకమైన శైలి. అతడి క్యారెక్టర్లు కానీ.. సన్నివేశాలు కానీ.. మాటలు కానీ.. తెరమీద చూస్తున్నపుడు వెంటనే కనెక్టయిపోవు. కాస్త సమయం గడిచాక నెమ్మదిగా మనసు లోతుల్లోకి దిగుతాయి. ‘బ్రహ్మోత్సవం’లో కూడా అలాంటి కొన్ని పాత్రలున్నాయి.. కొన్ని మంచి సన్నివేశాలున్నాయి.. కాకపోతే సినిమా సినిమాకు నరేషన్ విషయంలో నెమ్మదించి పోతున్న శ్రీకాంత్.. ఈ సినిమాకు వచ్చేసరికి డెడ్ స్లో అయిపోయాడు. టీవీ సీరియల్ కు ఏమాత్రం తీసిపోని వేగంతో సినిమా తీసి.. ప్రేక్షకులకు తలపోటు తెప్పించాడు.

శ్రీకాంత్ సినిమా సినిమాకూ సాధారణ ప్రేక్షకుల నుంచి.. ఎంటర్టైన్మెంట్ జోన్ నుంచి కొద్ది కొద్దిగా దూరం జరుగుతూ.. ఇంటలిజెంట్ ఆడియన్స్ కు మాత్రమే అర్థమయ్యేలా ‘మెచ్యూర్డ్’ సన్నివేశాలు తీర్చిదిద్దుకుంటున్నాడు. అతడి డైలాగ్స్ కూడా అలాగే ఉంటున్నాయి. ‘కొత్త బంగారు లోకం’ నుంచి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కి.. అక్కడి నుంచి ‘ముకుంద’కు.. చూసుకుంటే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు వచ్చేసరికి ఈ మెచ్యూరిటీ.. ‘పైత్యం’ స్థాయికి చేరిపోయింది. ఎంతో ఆలోచిస్తే కానీ.. పాత్రల ఉద్దేశమేంటో.. వారి సంభాషణల భావమేంటో అర్థం చేసుకోవడం కష్టం. ఇక నరేషన్ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. తాపీగా సాగే డెడ్ స్లో కథనం చాలా చోట్ల విసుగు తెప్పిస్తుంది. ప్రథమార్ధంలో పాటలు మరీ ఎక్కువైపోయి ఇబ్బంది పెడితే.. ద్వితీయార్ధంలో అసలు కథకు సంబంధం లేని వ్యవహారంతో ప్రేక్షకులకు పూర్తిగా నీరసం వచ్చేస్తుంది. ప్రథమార్ధంలో చెప్పిన కథకు.. రెండో అర్ధంలో వచ్చే హీరో మూలాల్ని వెతికే ఎపిసోడ్ కు ఏమాత్రం సంబంధం ఉండదు. ఇంటర్వెల్ దగ్గర కట్ అయిన కనెక్షన్ ను క్లైమాక్స్ లో కలపడానికి ప్రయత్నించాడు దర్శకుడు. ఐతే మధ్యలో చూపించిన సోదంతా భరించి చివరికి వరకు ప్రేక్షకులు నిలవడమే కష్టం.

ఇంటర్వెల్ ముందు వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇక్కడే కాదు.. క్లైమాక్స్ లో సైతం ఎమోషన్ బాగా పండింది. రావు రమేష్-మహేష్-సత్యరాజ్ ముగ్గురూ అద్భుత అభినయంతో ఈ సన్నివేశాల్ని నిలబెట్టారు. ఐతే ఈ రెండు ఎమోషనల్ హై పాయింట్స్ మధ్య నడిచే కథనమే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ద్వితీయార్ధంలో అసలు కథకు సంబంధం లేనట్లు సాగిపోయే ‘ఏడు తరాలు’ ఎపిసోడ్ బోరింగ్. ఉన్నట్లుండి ఏ సంబంధం లేకుండా వచ్చి ఊడి పడే సమంత పాత్ర లాగే.. హీరో రూట్స్ వెతుక్కుంటూ వెళ్లే ఎపిసోడ్ అసహజంగా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ ను తాపీగా నడిపించిన దర్శకుడు.. ఆ తర్వాత హడావుడిగా కథను క్లైమాక్స్ వైపు తీసుకెళ్లిపోయాడు. పతాక సన్నివేశం బాగుంది. మంచి కాన్సెప్ట్.. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు.. ప్రధాన పాత్రధారుల అభినయం.. సాంకేతిక విలువలు.. ‘బ్రహ్మోత్సవం’కు ఆకర్షణగా నిలిచినా.. నత్తనడకన సాగే కథనం.. దారి తప్పిన ద్వితీయార్ధం సినిమాను నీరుగార్చేశాయి.

నటీనటులు:

మహేష్ బాబు మరోసారి గొప్పగా నటించాడు. ఇంట్వెల్ ముందు సన్నివేశంలో మహేష్ బాబు నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. క్లైమాక్స్ లోనూ బాగా చేశాడు. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ తన టాలెంట్ చూపించాడు. కాజల్.. సమంతలతో అతడి కెమిస్ట్రీ బాగా కుదిరింది. తన గత సినిమాల్ని మించి ఇందులో యంగ్ గా.. గ్లామరస్ గా కనిపించాడు. ఐతే మహేష్ నుంచి మాస్ ఆడియన్స్ కోరుకునే అంశాలు ఇందులో లేవు. బాలా త్రిపురమణి పాటలో మాత్రమే డ్యాన్సులేశాడు. ఆ స్టెప్పులు ఫన్నీగా ఉన్నాయి. మహేష్ తర్వాత చెప్పుకోవాల్సింది రావు రమేష్ గురించే. శ్రీకాంత్ అడ్డాల తన పాత్రల మీద చూపించే ప్రత్యేక అభిమానాన్ని రావురమేష్ పూర్తిగా వాడుకున్నాడు. ఇలాంటి పాత్ర తాను మాత్రమే చేయగలను అనిపించేలా అద్భుతంగా నటించాడతను. బ్రహ్మోత్సవం సినిమాను తలుచుకోగానే.. కచ్చితంగా గుర్తుకొచ్చే పాత్ర అతడిది. సత్యరాజ్ కూడా బాగా చేశాడు. కాజల్.. సమంత హుషారుగా నటించారు. ఇద్దర్లోకి కాజల్ పాత్ర బాగుంది. సమంత క్యారెక్టర్ అసహజంగా అనిపిస్తుంది. ప్రణీతది పెద్దగా చెప్పుకోవాల్సిన పాత్రేమీ కాదు. జయసుధ.. రేవతి.. తనికెళ్ల భరణి.. వీళ్లందరూ తమ అనుభవం చూపించారు.

సాంకేతికవర్గం:

‘బ్రహ్మోత్సవం’ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కిన సినిమా. మిక్కీ జే మేయర్-గోపీ సుందర్ కలిసి మ్యూజిక్ తో ‘ఉత్సవం’ చేశారు. మిక్కీ పాటలు బాగున్నాయి. గోపీసుందర్ నేపథ్య సంగీతంతో సినిమాకు బలంగా నిలిచాడు. రత్నవేలు కెమెరా తెరను వర్ణరంజితం చేసింది. తోటతరణి అద్భుతమైన సెట్టింగ్స్ సినిమాకు వన్నె తెచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్. ప్రతి సన్నివేశంలోనూ రిచ్ నెస్ కనిపిస్తుంది. ఇక శ్రీకాంత్ అడ్డాల మరోసారి తనదైన శైలిలో ‘మంచి’ కథను ఎంచుకున్నా.. దాన్ని జనరంజకంగా మలచలేకపోయాడు. అతడి డ్రై స్క్రీన్ ప్లేనే సినిమాకు పెద్ద మైనస్. మహేష్ లాంటి సూపర్ హీరో.. ఏదడిగినా సమకూర్చే ప్రొడక్షన్ హౌస్ చేతిలో ఉన్నా.. సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కొంతవరకు ‘బ్రహ్మోత్సవం’తో కనెక్ట్ కావచ్చు. ఈ కథను ఎంటర్టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేసి ఉంటే.. ఎక్కువ మందికి చేరే అవకాశముండేది.

చివరగా: ఉత్సాహం లేని ‘బ్రహ్మోత్సవం’

రేటింగ్- 2.5/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre