Begin typing your search above and press return to search.

ఓటీటీలో 'బ్రహ్మాస్త్రం' ఓకే.. ఆకట్టుకోలేకపోయిన PS-1..!

By:  Tupaki Desk   |   5 Nov 2022 3:30 AM GMT
ఓటీటీలో బ్రహ్మాస్త్రం ఓకే.. ఆకట్టుకోలేకపోయిన PS-1..!
X
ప్రతీవారం మాదిరిగానే ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం కూడా పలు చిత్రాలు డిజిటల్ వేదికల మీదకు వచ్చాయి. అందులో ఈ ఏడాది భారీ చిత్రాల జాబితాలో నిలిచిన ''బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ'' మరియు "పొన్నియన్ సెల్వన్ 1" సినిమాలు కూడా ఉన్నాయి.

ఇటీవలి కాలంలో, విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసి అంచనాలు అందుకోలేకపోయిన బిగ్ బడ్జెట్ చిత్రాల్లో "బ్రహ్మాస్త్ర 1" మరియు "PS-1" ఉన్నాయనడంలో సందేహం లేదు. పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున రిలీజైన ఈ రెండు సినిమాలు మాతృకలో మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ.. ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. అలాంటి సినిమాలు ఇప్పుడు ఓటీటీ స్క్రీన్ మీదకు వచ్చాయి.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్‌ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ మూవీ 'బ్రహ్మాస్త్ర'. ఇందులో రణ్ బీర్ కపూర్ - అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ - కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఐదు ప్రధాన భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ చేయబడింది.

'బ్రహ్మాస్త్ర 1' చిత్రానికి తెలుగు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. థియేటర్లలో మిస్ అయిన జనాలు ఇప్పుడు ఓటీటీలో చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అందులోనూ హీరో రణబీర్ కపూర్ ఓటీటీ రిలీజ్ గురించి ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. అలానే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం 'బిగ్ బాస్' షో హోస్ట్ చేస్తున్న నాగార్జున సైతం తనవంతుగా ప్రమోట్ చేస్తుండటం కలిసొచ్చింది.

సకల అస్త్రాలకు అధిపతి బ్రహ్మాస్త్రం.. దాన్ని రక్షించే కొన్ని అద్భుత శక్తులు.. ఆ అస్త్రాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని శాసించాలనుకునే దుష్ట శక్తుల ప్రయత్నాలు. ఈ క్రమంలో జరిగే పోరాటాల నేపథ్యంలో 'బ్రహ్మాస్త్ర' సినిమా రూపొందింది. ఇందులో భారీ స్టార్ క్యాస్ట్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ ఆకర్షించే అంశాలుగా ఉన్నాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో మాత్రం మంచి వ్యూయర్ షిప్ రాబడుతోందని తెలుస్తోంది.

మరోవైపు లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన హిస్టారిక్ యాక్షన్ డ్రామా 'పొన్నియన్ సెల్వన్'. ఇది దర్శకుడి డ్రీం ప్రాజెక్ట్ గా పేర్కొనబడింది. ఇందులో విక్రమ్ - ఐశ్వర్యరాయ్ - త్రిష - కార్తీ - జయం రవి - శోభితా ధూళిపాళ్ల - ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. చోళుల కాలం నాటి కథాంశంతో ఈ సినిమా రూపొందింది. తమిళ్ లో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

'పొన్నియన్ సెల్వన్ 1' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ముందుగా రెంట్ మీద స్ట్రీమింగ్ చేసారు. నవంబర్ 4 నుంచి అన్ని భాషల్లోనూ సబ్ స్క్రైబర్స్ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. థియేట్రికల్ రిలీజ్ లో పేలవమైన స్పందన తెచ్చుకున్న ఈ చిత్రానికి.. ఓటీటీలోనూ అలాంటి స్పందనే వస్తోంది. తెలుగు ఆడియన్స్ డిజిటల్ వేదికలోనూ ఈ సినిమాపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

అందులోనూ 'PS-1' ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అటు చిత్ర బృందం కానీ.. ఇటు ప్రైమ్ టీమ్ కానీ పెద్దగా ప్రచారం చేయకపోవడంతో అసలు ఈ సినిమా డిజిటల్ లోకి వచ్చిందని కూడా ఎక్కువ మందికి తెలియలేదు. కారణాలు ఏవైనా ఈ వీకెండ్ లో 'బ్రహ్మాస్త్రం' సినిమాని చూస్తున్న తెలుగు ప్రేక్షకులు.. 'పొన్నియన్ సెల్వన్' గురించి అస్సలు పట్టించుకోవడం లేదని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

ఇకపోతే ఈ రెండు చిత్రాలకు సెకండ్ పార్ట్స్ రాబోతున్నాయి. 'పొన్నియన్ సెల్వన్' రెండో భాగం 'PS 2' వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రానున్నట్లు మణిరత్నం ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. రెండు భాగాల షూటింగ్ ఒకేసారి సమాంతరంగా జరపడం వల్ల అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. మరోవైపు మూడు భాగాలుగా ప్లాన్ చేసిన 'బ్రహ్మాస్త్ర 2' మూవీ ఎప్పుడు వస్తుందనే విషయంలో స్పష్టత లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.