Begin typing your search above and press return to search.

'బ్రహ్మాస్త్ర' బాలీవుడ్ కు పూర్వవైభవం తీసుకొచ్చేలా కనిపిస్తుందే..!

By:  Tupaki Desk   |   6 Sep 2022 3:58 PM GMT
బ్రహ్మాస్త్ర బాలీవుడ్ కు పూర్వవైభవం తీసుకొచ్చేలా కనిపిస్తుందే..!
X
ఇటీవల కాలంలో బాలీవుడ్ పరిస్థితి ఏమంత బాగాలేదు. ఒకప్పుడు భారతీయ సినిమాపై ఆధిపత్యం చలాయించిన హిందీ చిత్ర పరిశ్రమ.. సౌత్ సినిమా దెబ్బకు గడ్డుకాలం ఎదుర్కొంటోంది. బాలీవుడ్ స్టార్స్ సైతం మన హీరోల ధాటికి బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు "బ్రహ్మాస్త్ర" సినిమా బాలీవుడ్ కు పూర్వవైభవం తీసుకొచ్చేలా కనిపిస్తోంది.

పాండమిక్ తర్వాత హిందీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు సైతం మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టలేకపోతున్నాయనేది వాస్తవం. 2021లో వచ్చిన 'సూర్యవంశీ' సినిమా రూ. 26.29 కోట్లతో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఆ తర్వాత ఏ సినిమా కూడా ఆ స్థాయిలో ఓపెనింగ్ డే కలెక్షన్స్ అందుకోలేదు.

అదే సమయంలో RRR మరియు KGF 2 సినిమాలు ఈ ఏడాది హిందీ బెల్ట్‌ లో బిగ్ ఓపెనర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ మూవీ హిందీలో తొలిరోజు దాదాపు రూ. 20 కోట్ల వసూళ్లు రాబడితే.. కేజీఎఫ్-2 దాదాపు రూ. 54 కోట్లతో అతిపెద్ద ఓపెనర్‌ గా నిలిచింది. ఇప్పుడు "బ్రహ్మాస్త్ర" సినిమా ఈ బిగ్ లీగ్‌ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'బ్రహ్మాస్త్ర: మొదటి భాగం-శివ' సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ ముంబైలోనే కాకుండా సౌత్ లోని హైదరాబాద్ - బెంగళూరు - చెన్నైలలో కూడా చాలా బాగున్నాయి.

PVR మల్టీఫ్లెక్స్ లలో ఇప్పటికే 'బ్రహ్మాస్త్ర' సినిమాకు ఒక లక్ష టికెట్లు బుక్ చేసుకున్నట్లు థియేటర్ చైన్ సిస్టర్ అధికారికంగా ప్రకటించింది. ఇది మంచి ఓపెనింగ్స్ ట్రెండ్‌ లో కీలకపాత్ర పోషిస్తుంది. తొలిరోజు ఇండియాలో దాదాపు రూ. 30 కోట్ల వసూళ్లను సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే.. పరిస్థితులు ఎలా ఉన్నా 'బ్రహ్మాస్త్ర' హిందీ కలెక్షన్లు నార్త్ సర్క్యూట్స్ లో RRR ఓపెనింగ్ డే కలెక్షన్లను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు మూడు రోజుల్లో బుకింగ్స్ మరింతగా పెరగనున్నాయి. ఇది తీవ్ర ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్‌ కి కచ్చితంగా ఉపశమనం కలిగించే విషయమని చెప్పాలి.

కాగా, 'బ్రహ్మాస్త్ర' సినిమాలో రణబీర్ కపూర్ - అలియా భట్ - అమితాబ్ బచ్చన్ - అక్కినేని నాగార్జున - మౌనీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు ఈ మాగ్నమ్ ఓపస్ ని నిర్మిస్తున్నాయి. నాలుగు దక్షిణాది భాషల్లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.