Begin typing your search above and press return to search.

బ్రహ్మాస్త్ర 2 .. శివ‌-పార్వ‌తులుగా హృతిక్ - దీపిక‌?

By:  Tupaki Desk   |   29 July 2022 8:30 AM GMT
బ్రహ్మాస్త్ర 2 .. శివ‌-పార్వ‌తులుగా హృతిక్ - దీపిక‌?
X
రణబీర్ కపూర్ - అలియా భట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన 'బ్రహ్మాస్త్ర' ఎట్టకేలకు 9 సెప్టెంబర్ 2022న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం శివ .. ఇషాల ప్రయాణానికి సంబంధించిన క‌థ‌తో తెర‌కెక్కింది. అందుకే పార్ట్ 1కి శివ స్టోరీ అని పేరు పెట్టారు.

ఈ ఫ్రాంఛైజీ రెండవ భాగం మ‌రింత ఉత్కంఠ పెంచేలా తీర్చిదిద్దేందుకు ద‌ర్శ‌కుడు ఆయాన్ ముఖ‌ర్జీ త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. పార్ట్ 2 లో మహాదేవ్ - పార్వతి అనే మరో రెండు పాత్రలను జోడిస్తున్నార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. సుమారు ఒక నెల క్రితం అయాన్ ముఖర్జీ నేరుగా హృతిక్ రోషన్ ఇంటికి వెళ్లి మ‌రీ మహాదేవ్ పాత్రను ఆఫర్ చేసార‌ని క‌థ‌నాలొచ్చాయి.

మహాదేవ్ పాత్రకు హృతిక్ లాంటి స్వ‌యంప్ర‌కాశ‌క శ‌క్తి ఉన్న స్టార్ అవ‌స‌రం. పురాణేతిహాసం స్ఫూర్తితో రూపొందుతున్న మోడ్ర‌న్ పౌరాణిక చిత్రానికి అత‌డు స‌రిగ్గా స‌రిపోతాడు అని అయాన్ భావించారు. అయితే ఇంకా హృతిక్ నుండి గ్రీన్ సిగ్న‌ల్ రావాల్సి ఉంది.

అతను త‌న పాత్రను బ్ర‌హ్మాస్త్ర ప్రపంచాన్ని లైక్ చేసాడు.. అని టాక్ వినిపిస్తోంది. పార్వతి పాత్రలో నటించేందుకు మేకర్స్ దీపికా పదుకొనెతో చర్చలు జరుపుతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.

హృతిక్ ప్రస్తుతం విక్రమ్ వేద విడుదల ప్ర‌మోష‌న్స్ కు సిద్ధమవుతున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న 'ఫైటర్‌'లో దీపికా పదుకొణెతో కలిసి కనిపించనున్నాడు. హృతిక్ కి తదుపరి నాలుగేళ్ల‌కు స‌రిప‌డా డైరీ ఫుల్ అయ్యింది. ఇందులో క్రిష్ 4 - వార్ 2 లాంటి సీక్వెల్ సినిమాలు ఉన్నాయి. అలాగే 'రామాయణం 3డి' కూడా కార్డ్స్ లో ఉంది. అతను ప్రస్తుతం వైవిధ్య‌మైన‌ పాత్రలలో నటిస్తూ అత్యంత బిజీ స్టార్ గా కొన‌సాగుతున్నారు. మ‌రోవైపు దీపిక ప‌దుకొనే వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే లో దీపిక క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

హృతిక్ త‌న కోస్టార్ సబా ఆజాద్ తో ఎఫైర్ సాగిస్తున్నాడ‌న్న‌ ఆరోపణలతో నిరంత‌రం వార్తల్లో నిలుస్తున్నాడు. ప్ర‌స్తుతం సాబాతో విదేశీ విహారయాత్రలో ఉన్నాడు. ఈ జంట కొద్ది రోజుల క్రితం ముంబై విమానాశ్రయంలో కెమెరాల‌కు చిక్కిన ఫోటోలు కొన్ని ఇంత‌కుముందు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.