Begin typing your search above and press return to search.

బ్రహ్మి నోటి అలాంటి డైలాగులా?

By:  Tupaki Desk   |   10 Dec 2015 11:00 PM IST
బ్రహ్మి నోటి అలాంటి డైలాగులా?
X
ఓ పక్క 30 ఇయర్స్ పృథ్వీ క్యారెక్టర్లు వరుసగా పేలిపోతున్నాయి. సినిమా సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కేస్తున్నాడు పృథ్వీ. అదే సమయంలో బ్రహ్మానందం హవా రోజు రోజుకీ తగ్గిపోతోంది. ఆయన క్యారెక్టర్లు వరుసగా తుస్సుమంటున్నాయి. ఇలాంటి సమయంలో ఈ ఇద్దరు కమెడియన్లు ఒకే సినిమాలో కనిపిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఫ్యూచర్ స్టార్ సిద్దప్ప.. అమలాపాల్.. ఈ రెండు క్యారెక్టర్లలో ఏది పేలుతుందా.. ఎవరు నిలబడతారా అని ఎదురు చూశారు. ఐతే రైజింగ్ లో ఉన్న హ్యాండే గెలిచింది. సిద్దప్ప చెలరేగిపోయాడు. అమలాపాల్ తుస్సుమన్నాడు. ‘బెంగాల్ టైగర్’లో పృథ్వీ క్యారెక్టర్ ఎంతగా పేలిందో.. బ్రహ్మి పాత్ర అంత సాదాసీదాగా కనిపించింది.

సిద్దప్ప పాత్రలో పృథ్వీ కనిపించిన ప్రతిసారీ గిలిగింతలు పెట్టాడు. కానీ బ్రహ్మి మాత్రం కనిపించిన తొలి సన్నివేశంలో తప్ప మెరుపులు మెరిపించలేకపోయాడు. ఐతే ఈ మధ్య తన పనైపోయిందని ప్రచారం గట్టిగా సాగుతున్న నేపథ్యంలో ఎన్నడూ లేనిది తొలిసారిగా బ్రహ్మి కొంచెం సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేయడం విశేషం. ఇవి ఒకరకంగా తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారికి పంచ్ లుగా కూడా భావించవచ్చు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకంటే బిజీ ఎవరూ లేరు’’ అని ఓ డైలాగ్... ‘‘నా టైమింగ్ వల్లే నా టైమ్ ఇంత బాగా నడుస్తోంది’’ అని ఇంకో డైలాగ్.. ఇవి తన కెరీర్ ను ఉద్దేశించి పలికిన మాటలు అని వేరే చెప్పాల్సిన పని లేదు. నిజంగా తన టైం నడిచినపుడు ఎప్పుడూ కూడా బ్రహ్మి ఇలాంటి డైలాగులు పలికింది లేదు. కానీ ఇప్పుడీ డైలాగులు ఆయన నోట వచ్చాయంటే ఏమని అర్థం?