Begin typing your search above and press return to search.

చిరు-మహేష్-బాలయ్య అంటున్న బోయపాటి

By:  Tupaki Desk   |   9 Aug 2017 4:19 PM IST
చిరు-మహేష్-బాలయ్య అంటున్న బోయపాటి
X
ఇప్పుడున్న టాలీవుడ్ దర్శకుల్లో మాస్ మసాలా సినిమా చేయడంలో దిట్ట ఎవరంటే బోయపాటి శ్రీను అనే చెప్పాలి. చాలామంది స్టార్ డైరెక్టర్లు మాస్ సినిమాల నుంచి దూరం జరిగి కొత్త తరహా కథల మీద దృష్టిపెడుతుంటే.. బోయపాటి మాత్రం తన బలాన్ని విడిచిపెట్టట్లేదు. ప్రేక్షకులు కొత్త తరహా సినిమాలకే పట్టం కడుతున్న సమయంలో కూడా మాస్ కథలతో మెప్పించడం ద్వారా బోయపాటి తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. గత ఏడాది ‘సరైనోడు’తో బ్లాక్ బస్టర్ కొట్టిన బోయపాటి ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా ‘జయ జానకి నాయక’తో వస్తున్నాడు. దీని తర్వాత ముగ్గురు టాలీవుడ్ సూపర్ స్టార్ల కోసం కథలు రెడీ చేస్తున్నట్లు బోయపాటి చెప్పడం విశేషం.

ఆ ముగ్గురు హీరోలు మరెవరో కాదు.. చిరంజీవి.. మహేష్ బాబు.. బాలకృష్ణ. ఈ ముగ్గురితోనూ తన సినిమాలు ఉంటాయని బోయపాటి స్పష్టం చేశాడు. వాళ్ల కోసం కథలు కూడా సిద్ధం చేస్తున్నట్లు చెప్పాడు. చిరంజీవి కోసం కథ సిద్ధంగా ఉందని.. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పూర్తవగానే ఆయనతో సినిమా ఉండొచ్చని బోయపాటి చెప్పాడు. ఇక మహేష్ తో చర్చలు జరిగాయి కానీ.. కథ చెప్పలేదని.. ఎక్కువ డేట్లు అవసరమవుతాయి కాబట్టి అందుకు తగ్గట్లుగా ఆలోచన చేస్తున్నామని తెలిపాడు. ఇక బాలయ్య కాంబినేషన్ లో తన మూడో సినిమా కూడా ఉంటుందన్న బోయపాటి.. వచ్చే ఏడాది జులైలో ఆ సినిమా మొదలయ్యే అవకాశాలున్నట్లు చెప్పడం విశేషం. బాలయ్య కోసం మరోసారి పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు బోయపాటి తెలిపాడు.