Begin typing your search above and press return to search.

బోయపాటి పని అయిపోయిందా? మారాల్సిందేనా?

By:  Tupaki Desk   |   21 Oct 2019 10:26 AM IST
బోయపాటి పని అయిపోయిందా? మారాల్సిందేనా?
X
బోయపాటి శ్రీనివాస్.. టాలీవుడ్ లోనే మాంచి మాస్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో చూపించే రౌద్రం - ఎమోషన్ - కసికి ప్రేక్షకులు ఫిదా అయిన రోజులున్నాయి. విలన్ ను పీక్ స్టేజ్ లో చూపించి నరకాసురిడికి పదో అవతారంగా మార్చి చివరకు హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో బోయపాటికి గట్టి పట్టుంది. బోయపాటి సినిమాలోని ఎమోషన్ సీన్లు చూస్తే మనకే విలన్ ను కొట్టాలనిపించేలా ఉంటాయి. తలమొండం వేరు చేసే సన్నివేశాలు - ఒక్క హీరోనే వందల మంది కొట్టే సీన్లు బోయపాటి సినిమాలు కోకొల్లాలు.. అయితే ఒకటి - రెండు.. పోనీ మూడు సినిమాల్లో ఈ హై ఎండ్ ఎమోషన్ ను క్యారీ చేయవచ్చు. అదే ఎమోషన్ ను పదే పదే క్యారీ చేస్తేనే ప్రాబ్లం. అందుకే విజయాల దర్శకుడు బోయపాటి కాస్తా అపజయాల బాటపట్టారు. ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు కూడా వెనుకాడే పరిస్థితిని తెచ్చుకున్నారన్న టాక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

*కొత్తకు ఒక వింత.. పాత ఒక రోత..

అవే మాస్ కథలు.. అయితే రాయలసీమ.. లేదంటే మాఫియా.. అదీ కుదరకపోతే రాజకీయ నేపథ్యం.. పగ ప్రతీకారాలు మాత్రం కామన్.. ఇవే టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కథలు. తరం మారింది. టాలీవుడ్ లోకి కొత్త దర్శకులు పుట్టుకొస్తున్నారు. సరికొత్త కథలను తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండింగ్ టెక్నికల్ అంశాలను తీసుకొని కొత్త దర్శకులు విభిన్నమైన కథలతో సినిమాలు తీస్తూ హిట్ కొడుతున్నారు. బోయపాటి మాత్రం ఇంకా అదే మాస్ - నాలుగు బీభత్సమైన ఫైట్స్ ప్లాన్ చేసి చూడమంటున్నారు. కొన్ని సినిమాల వరకు ఒకే.. కానీ అదే మూసను ప్రేక్షకులు ఇష్టపడరనడానికి ఇటీవల ఆయనకు దక్కిన ‘వినయ విధేయ రామ’ అపజయమే నిదర్శనం. ఆ సినిమాలో భారీ తారాగణం - కావాల్సిన ఫైట్స్ - మాస్ అంశాలున్నా బోయపాటి అదే మూస ధోరణిలో వెళ్లడంతో ప్రేక్షకులు తిరస్కరించారని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు.

*మాస్ పల్స్ వీడి కొత్తదనం చూపించాల్సిందే..?

కాలం మారుతోంది. ఎన్నో కొత్త కథలు కథకులు ఆవిష్కరిస్తున్నారు. ఆధునికంలో టెక్నికల్ వండర్స్ ను కథలుగా మలుస్తున్నారు. చరిత్ర దాచిన వీరుల కథలు ‘సైరా - ఆర్ ఆర్ ఆర్’ తెరపైకి వచ్చాయి. అయితే బోయపాటి మాత్రం ఇంకా అదే హై ఎండ్ ఫైట్స్ - అదే మాస్ ఫార్ములాతో దున్నేస్తానంటే కుదరదు. ఇలానే బోయపాటి సాగితే వెనక్కి వెళ్లడం ఖాయమని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. కొత్తదనం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేస్తున్నారు.