Begin typing your search above and press return to search.

ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి సినీ ప్రస్థానానికి 15 ఏళ్ళు...!

By:  Tupaki Desk   |   12 May 2020 9:00 PM IST
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి సినీ ప్రస్థానానికి 15 ఏళ్ళు...!
X
ప్రస్తుతం టాలీవుడ్ లో ఊర మాస్ చిత్రాలని తెరకెక్కించగలిగే అతి కొద్దిమంది దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలు బాలకృష్ణ - వెంకటేష్ - రవితేజ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ లాంటి హీరోలతో ఊర మాస్ యాక్షన్ చిత్రాలను రూపొందించాడు. 'భద్ర' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన బోయపాటి శీను త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతుంది. కెరీర్ స్టార్ట్ చేసిన ఈ పదిహేనేళ్లలో కేవలం 8 సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేసాడు బోయపాటి. స్లో అండ్ స్టడీగా సినిమాలను రూపొందిస్తూ టాలీవుడ్ లో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్‌ గా తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. రవితేజ హీరోగా నటించిన 'భద్ర' సినిమా 2005 మే 12న విడుద‌లైంది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడిగా బోయపాటి శ్రీను వెనుదిరిగి చూసుకోలేదు. 'భద్ర' తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని విక్టరీ వెంకటేష్ - నయనతార కాంబినేషన్ లో 'తులసి' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత మూడేళ్ళ విరామం తీసుకొని నందమూరి బాలకృష్ణ హీరోగా 'సింహా' సినిమాని తెరకెక్కించాడు బోయపాటి. ఈ సినిమా బాలయ్య కెరీర్లో రికార్డ్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచిపోయింది. బోయపాటి అంటే మాస్ సినిమాకి కేరాఫ్ అడ్రెస్స్ అనేలా మార్చేసింది ఈ సినిమా.

ఇక ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'దమ్ము' సినిమా మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బోయపాటికి బ్రేక్ వేసింది దమ్ము. ఆ తర్వాత మళ్ళీ బాలయ్యతో కలిసి 'లెజెండ్' సినిమా తీసాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. మొదటి సినిమా హీరో కావాల్సిన అల్లు అర్జున్ తో 'సరైనోడు' అనే ఊర మాస్ సినిమా చేసాడు. బన్నీలోని మాస్ యాంగిల్ పూర్తిగా బయటకి తీసి ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందించాడు. ఆ తర్వాత అప్పటి వరకు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్న బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ తో 'జయజనకి నాయక' చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ మితిమీరిన బడ్జెట్ వల్ల కలెక్షన్స్ ఆశాజనకంగా రాలేదు. దీంతో రెండేళ్ల గ్యాప్ తీసుకొని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'వినయ విధేయ రామ' సినిమా తీసాడు. 'రంగస్థలం' సినిమాతో ఊపు మీద చరణ్ ని ఈ సినిమా ఉసూరుమనిపించింది. ఈ సినిమా బోయపాటి పేరు చెప్తే ప్రొడ్యూసర్స్ భయపడేలా చేసింది. ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని ఆయన కెరీర్ కి మాయని మచ్చలా మిగిలిపోయింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను నందమూరి నటసింహా బాలకృష్ణతో హాట్రిక్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.

టాలీవుడ్ లో దర్శకుడిగా 15 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న బోయపాటి శ్రీను సోషల్ మీడియా వేదికగా తన జర్నీ విశేషాలు షేర్ చేసుకున్నాడు. ''15 ఏళ్ల క్రింత ఇదే రోజున ద‌ర్శ‌కుడిగా నా ప్ర‌యాణం స్టార్ట్ అయింది. వివిధ ఎమోష‌న్స్‌.. క‌ల‌లు.. ప్యాష‌న్‌.. ఎంట‌ర్‌టైన్ చేయాల‌నే ల‌క్ష్యంతో నేను తొలి అడుగు వేశాను. చాలా జ్ఞాప‌కాలు మరియు స‌వాళ్ల‌తో నేను ఊహించిన దానికంటే అందంగా ఇన్నేళ్ల ప్ర‌యాణం సాగింది. నా మార్గంలో నేను క‌లిసిన ప్ర‌తి వ్య‌క్తి వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంది. నేను నా సినిమాల్లో వ‌ర్క్ చేసిన నా యాక్ష‌న్ హీరోల‌కు.. అంద‌మైన హీరోయిన్స్‌ కు.. విజ‌న్ ఉన్న నిర్మాత‌ల‌కు.. గొప్ప సాంకేతిక నిపుణులకు.. ఆర్టిస్టుల‌కు.. అద్భుత‌మైన ప్రేక్ష‌కుల‌కు.. నా కుటుంబానికి.. వీట‌న్నింటికీ మించి దేవుడికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. మీకు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. మీరు అందించిన స‌హ‌కారానికి.. మార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని నేను మ‌ర‌చిపోలేను. త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ‌తో నా మూడో సినిమా ద్వారా మీ ముందుకు వ‌స్తున్నాను'' అని బోయపాటి శ్రీను పేర్కొన్నారు.