Begin typing your search above and press return to search.

తెలుగు తెర పై బాక్సింగ్ 'పంచ్'లు..!

By:  Tupaki Desk   |   8 April 2022 8:50 AM GMT
తెలుగు తెర పై బాక్సింగ్ పంచ్లు..!
X
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలను ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద క్రీడల నేపథ్యంలో.. క్రీడాకారుల జీవితాలను ఆధారంగా అనేక చిత్రాలు వచ్చాయి.. వస్తూనే ఉంటాయి. అందులో బాక్సింగ్ డ్రామాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

బాక్సింగ్ కు భావోద్వేగాలు - కమర్షియల్ ఎలిమెంట్స్ కలబోసి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్స్ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. హీరోలు పంచ్ డైలాగులు కొడితే ప్రేక్షకులకు ఎలాంటి కిక్ వస్తుందో.. బాక్సింగ్ రింగులో దిగి పంచ్ కొడితే ఫ్యాన్స్ కి రెట్టింపు కిక్ వస్తుంది.

అందుకే బాక్సింగ్ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించడానికి ఫిలిం మేకర్స్ ఆసక్తి కనబరుస్తుంటారు.. అందులో నటించడానికి స్టార్ హీరోలు ముందుకు వస్తుంటారు. నిజానికి బాక్సింగ్ సినిమాల్లో నటించడం అంత సులభమేమీ కాదు.

శారీరకంగా కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది.. మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉండాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మన హీరోలు బాక్సింగ్ రింగ్ లో దిగడానికి రెడీగా ఉంటారు. ప్రొఫెషనల్ బాక్సర్స్ గా కనిపించడానికి తీవ్రంగా కష్టపడుతుంటారు.

తెలుగు తెరపై బాక్సింగ్ పంచ్ లతో ప్రేక్షకులను అలరించిన సినిమాలు కూడా ఉన్నాయి. సుమన్ - భాను చందర్ - వినోద్ కుమార్ వంటి ఒకప్పటి హీరోలు పంచ్ లతో హిట్లు అందుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా నటించిన బాక్సింగ్ డ్రామా 'గని' విడుదలైన నేపథ్యంలో.. ఇదే బ్యాక్ డ్రాప్ తో తెలుగులోకి వచ్చిన సినిమాలను ఒకసారి పరిశీలిద్దాం..!

* 'తమ్ముడు' - పవన్ కళ్యాణ్ హీరోగా అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. 'జో జీతా వోహీ సికందర్' అనే హిందీ చిత్రానికి రీమేక్ గా రూపొందింది. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాత. 1996లో విడుదలైన ఈ సినిమా పవన్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇందులో పవన్ చేసిన రియల్ స్టంట్స్ ఎందరికో స్పూర్తినిచ్చాయి. రమణ గోగుల స్వరపరిచిన ‘లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్’ పాట ఇప్పటికీ ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. ఇప్పుడు 'గని' సినిమాకి కూడా 'తమ్ముడు'నే రెఫరెన్స్ గా తీసుకున్నారని తెలుస్తోంది.

* 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' - మాస్ మహారాజా రవితేజ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఇది. ఆసిన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ - జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా 2003 ఏప్రిల్ 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ఈ సినిమా తమిళ్ - కన్నడ - ఒడియా - భోజ్ పురి భాషల్లోకి రీమేక్ చేయబడింది.

* 'జానీ' - పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మార్షల్ ఆర్ట్స్ మూవీ ఇది. దీనికి కథ - స్క్రీన్ ప్లే కూడా పవనే రాసుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' సినిమా వచ్చిన వారం తర్వాత (2003 ఏప్రిల్ 25) విడుదల కాబడిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రింట్స్ లో రిలీజైన ఫస్ట్ తెలుగు సినిమాగా 'జానీ' కి రికార్డ్ ఉంది.

* 'జై' - తేజ దర్శకత్వంలో నవదీప్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన సినిమా ఇది. బాక్సింగ్ కు ప్రేమ కథను మిక్స్ చేసి దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కించారు. తేజ్ హోమ్ బ్యానర్ లో నిర్మించారు. 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

* 'గురు' - విక్టరీ వెంకటేష్ హీరోగా సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో రితికా సింగ్ కు బాక్సింగ్ నేర్పించే కోచ్ గా వెంకీ నటించారు. బాక్సింగ్ అసోసియేషన్ రాజకీయాలకు బలైన ఓ బాక్సర్.. ఒక పల్లెటూరి అమ్మాయిని ఎలా ఛాంపియన్ ని చేసాడనేదే ఈ చిత్ర కథాంశం. 2017 లో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా సూపర్ హిట్ అయింది. ఇది మాధవన్ హీరోగా సుధా కొంగర తీసిన 'సాలా ఖడూస్' చిత్రానికి రీమేక్.

* 'సార్పట్ట' - విలక్షణ దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కించిన పీరియాడికల్ బాక్సింగ్ డ్రామా ఇది. ఆర్య హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో నేరుగా ఓటీటీలో రిలీజయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ దక్కింది.

* 'గని' - బాక్సింగ్ నేపథ్యంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఈరోజే (ఏప్రిల్ 8) థియేటర్లలోకి వచ్చింది. ఇందులో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించారు. కిరణ్ కొర్రపాటి దీనికి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ కంపెనీ మరియు రెనసాన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై అల్లు వెంకటేష్ (బాబీ) - సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

* 'లైగర్' - పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కరణ్ జోహార్ - చార్మీ కౌర్ - పూరీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022 ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా లైగర్ విడుదల కానుంది.

ఇకపోతే దర్శకుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో 'ఈ నగరానికి ఏమైంది' ఫేమ్ సుశాంత్ రెడ్డి హీరోగా ఓ బాక్సింగ్ సినిమా తెరకెక్కుతోంది. రోహిత్ తంజావూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందులో ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి చాలా కష్టపడి పర్ఫెక్ట్ బాడీని రెడీ చేశారు.