Begin typing your search above and press return to search.

చిరంజీవితో పోటీ పడేది అతడేనా?

By:  Tupaki Desk   |   14 March 2020 3:30 AM GMT
చిరంజీవితో పోటీ పడేది అతడేనా?
X
పండుగ సమయాల్లో పెద్ద హీరోల సినిమాలు పోటీపడి విడుదలవుతుంటాయి. రెండు మూడు సినిమాలు ఆడే స్కోప్‌ కూడా ఫెస్టివల్‌ సీజన్ లో ఉంటుంది. మరి పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే కలెక్షన్లు పంచుకోవాల్సిన స‌న్నివేశం ఇబ్బందిక‌ర‌మే. బాక్సాఫీసు వద్ద నువ్వా.. నేనా అనేలా పోటీ నెలకొంటుంది. ఈ పోటీలో బాగున్న సినిమా దూసుకుపోతుంది. కాస్త డివైడ్‌ టాక్‌ వచ్చిన చిత్రం వెనకబడుతుంది. దీంతో సినిమాని కొన్న బయ్యర్లు.. ఎగ్జిబిటర్లు నష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. వచ్చే దసరాకి అలాంటి భారీ పోటీ షురూ కానుంది. అయితే అది కేవలం తెలుగు బాక్సాఫీసు వద్ద కాదు.. ఏకంగా సౌత్‌ ఇండియన్‌ బాక్సాఫీసు వద్దే కావడం విశేషం. మరి ఆ పోటీ ఎవరి మధ్య అనేది తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.

మెగాస్టార్‌ చిరంజీవి.. కన్నడ యువ సంచలనం యశ్‌ మధ్యనే ఈ పోటీ అని తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. సామాజిక సందేశం.. వినోదం మేళవింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి `ఆచార్య` అనే టైటిల్‌ వినిపిస్తోంది. . ఇందులో చిరు ఫారెస్ట్ అధికారిగా కనిపిస్తారని.. దేవాదాయ శాఖ కుంభ‌కోణం నేప‌థ్యంలో సినిమా ఇద‌ని టాక్. ఇద్దరు టాప్‌ స్టార్స్ కలిసి నటిస్తున్న సినిమా కావడం.. పైగా మినిమమ్‌ గ్యారంటీ దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న సినిమా కావడం తో దీనిపై అంచనాలు ఆకాశం అంచుల్ని తాకాయి. పైగా రామ్ చరణ్‌ నిర్మిస్తుండటం దీనికి కలిసొచ్చే అంశం. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం- కన్నడ- మలయాళం- హిందీ వంటి భాషల్లో కూడా రిలీజ్ కు ప్లాన్‌ చేస్తున్నారు.

మరోవైపు కన్నడ రాక్ స్టార్ య‌శ్ న‌టించిన‌ చిత్రం `కేజీఎఫ్‌: చాప్టర్‌ 1` దక్షిణాది భాషల్లో విడుదలై సంచలన విజయం సాధించిన నేప‌థ్యంలో ఓవర్‌ నైట్ లో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యశ్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్‌ రూపొందుతుంది. ఇందులో విలన్‌ పాత్ర అయిన అధీర గా బాలీవుడ్‌ మున్నాభాయ్‌ సంజయ్‌ దత్‌ నటిస్తున్నారు. ఆయనతోపాటు రవీనా టండన్‌.. రావు రమేష్‌ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లోనే విడుదల కావాల్సింది. కానీ షూటింగ్‌.. పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల విషయంలో చిత్ర బృందం రాజీపడటం లేదట. దీంతో కాస్త ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందట. అందుకే దసరా రిలీజ్ కి నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ ప్లాన్ చేస్తోంది. ఇప్ప‌టికే అక్టోబ‌ర్ 23 రిలీజ్ అంటూ అధికారికంగా పోస్ట‌ర్ ని వేసింది చిత్ర‌బృందం. మే ఐ క‌మిన్ అంటూ గ్యాంగ్ స్ట‌ర్ య‌శ్ పోస్ట‌ర్ ని తాజాగా హోంబ‌లే సంస్థ రిలీజ్ చేసింది.

కేజీఎఫ్‌ మొదటి భాగం లానే సీక్వెల్ ని కన్నడతోపాటు తెలుగు- తమిళం- మలయాళం- హిందీ భాషల్లో భారీగా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే జరిగితే ఓ వైపు చిరు `ఆచార్య`.. మరోవైపు `కేజీఎఫ్‌: చాప్టర్‌ 2` బాక్సాఫీసు వద్ద పోటీపడక తప్పదు. అయితే మెగాస్టార్ చిరంజీవితో యంగ్‌ హీరో పోటీపడుతుండ‌డం ఆస‌క్తి రేకెత్తించేదే. చిరు ముందు య‌శ్ సినిమా అని తీసి పారేయ‌లేం. సైరా స్టార్ స్టామినా ఒక ర‌కంగా వ‌ర్క‌వుటైతే.. కేజీఎఫ్ స్టార్ గా య‌శ్ స్టామినా మ‌రో ర‌కంగా వ‌ర్క‌వుట్ కావ‌డం గ్యారెంటీ. మరి ఈ పోటీలో ఎవ‌రు ఏ స్థాయిలో క‌లెక్ష‌న్స్ సాధిస్తారు అన్న‌ది తెలియాలంటే విడుదల వరకు వెయిట్‌ చేయాల్సిందే.