Begin typing your search above and press return to search.

భారీ చిత్రాలను బరిలోకి దింపుతున్న బోనీ కపూర్!

By:  Tupaki Desk   |   6 Feb 2022 7:35 AM GMT
భారీ చిత్రాలను బరిలోకి దింపుతున్న బోనీ కపూర్!
X
బోనీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాత. మొదటి నుంచి కూడా నిర్మాతగానే ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. 'మిస్టర్ ఇండియా' .. 'రూప్ కీ రాణి చోరొంకా రాజా' .. 'జుదాయి' వంటి భారీ హిట్లు ఆయన ఖాతాలో కనిపిస్తాయి. ఇక ఆయన అంచనాలు తలక్రిందులై భారీ పరాజయాలను తెచ్చిపెట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. అప్పటికీ ఆయన తెలుగు .. తమిళ భాషల్లో భారీ విజయాలను అందుకున్న సినిమాలనే హిందీలో రీమేక్ చేస్తూ వెళ్లారు. ఇక ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ధైర్యంగా ఆయన ముందుకు వెళుతూనే ఉన్నారు.

శ్రీదేవి చనిపోయిన తరువాత ఆ డిప్రషన్ కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, ఆ తరువాత నుంచి స్పీడ్ పెంచారు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వలిమై' సిద్ధంగా ఉంది. అజిత్ హీరోగా చేసిన ఈ సినిమాకి హెచ్. వినోద్ దర్శకత్వం వహించాడు. తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో సంక్రాంతికి విడుదల కావలసిన ఈ సినిమా కరోనా తీవ్రత కారణంగా వాయిదా పడింది. అలాంటి ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన ఆయన థియేటర్స్ లో దింపుతున్నారు. కార్తికేయ విలన్ గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఆ తరువాత కూడా బోనీ కపూర్ నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు .. వాటిలో ఒకటిగా 'మైదాన్' కనిపిస్తుంది. అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా, ఫుట్ బాల్ క్రీడకి మరింత పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన సయ్యద్ అబ్దుల్ రహీద్ జీవితచరిత్రగా ఈ సినిమా రూపొందుతోంది. ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదనే చెప్పే కథ ఇది. ఈ సినిమాలో ప్రియమణి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

'మైదాన్' సినిమాను హిందీతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో జూన్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక మరో వైపున 'మిళి' పనులు కూడా చురుకుగా జరుగుతున్నాయి. జేవీఆర్ మాతుకుట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, జాన్వీ కపూర్ .. సన్నీ కౌశల్ నాయకా నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి కూడా ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక తమిళంలో ఉదయనిధి స్టాలిన్ - తాన్య రవిచంద్ర జంటగా 'నెంజుకు నీధి' .. ఆర్.జె. బాలాజీ - అపర్ణ బాలమురళి జంటగా 'వీటిలా విషేషంగా' కూడా రెడీ అవుతున్నాయి. అజిత్ తోనే మరో సినిమాను చేయడానికి బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారు. మార్చి నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది.