Begin typing your search above and press return to search.

పవన్ సినిమా ఫిక్స్ అంటున్న బోనీ

By:  Tupaki Desk   |   4 Nov 2019 1:30 AM GMT
పవన్ సినిమా ఫిక్స్ అంటున్న బోనీ
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే వాటిలో ఏది నిజం.. ఏది ఊహాగానం అనేది ఎవరికీ తెలియడం లేదు. అయితే పవన్ నెక్స్ట్ సినిమా విషయంలో క్లారిటీ వచ్చేసింది. నిన్నప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా 'పింక్' రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారని.. ఈ సినిమాను దిల్ రాజుతో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్నారని వెల్లడించారు.

ఇక బోనీ కపూర్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా తరణ్ ఆదర్శ్ ట్వీట్ ను రీట్వీట్ చేయడమే కాకుండా ముంబై మీడియాతో ముచ్చటిస్తూ 'పింక్' తెలుగు రీమేక్ ను ఖరారు చేశారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన బోనీ గత కొంత కాలంగా సౌత్ సినిమాలు కూడా నిర్మించాలని ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా మొదట 'పింక్' తమిళ రీమేక్ ను అజిత్ కుమార్ తో నిర్మించారు. 'నేర్కొండ పార్వై' పేరుతో తెరకెక్కిన తమిళ రీమేక్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో ఏకంగా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమాను నిర్మించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా శ్రీరామ్ వేణును ఎంచుకున్నారు.

'పింక్' సినిమాకు అనిరుద్ధ రాయ్ దర్శకుడు. ఈ సినిమాకు షుజిత్ సర్కార్ కథ అందించారు. అమితాబ్ బచ్చన్.. తాప్సీ పన్ను.. కీర్తి కుల్హారి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.