Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే నిర్మాత అయ్యాడు

By:  Tupaki Desk   |   25 April 2016 5:45 AM GMT
ఎమ్మెల్యే నిర్మాత అయ్యాడు
X
సినీ రంగానికి.. రాజకీయ రంగానికి.. మంచి సంబంధాలే ఉంటాయి. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తుంటారు. రాజకీయ నేతలు సినిమాల్లోకి అడుగుపెడుతుంటారు. ఐతే పొలిటీషియన్స్ సినిమాల్లోకి నేరుగా అడుగుపెట్టకుండా తెర వెనుక నిలవడం ఎక్కువగా చూస్తుంటాం. వైఎస్ బావమరిది.. కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని లాంటి కొంతమంది మాత్రమే నేరుగా నిర్మాతలయ్యారు. తాజాగా అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమ కూడా వీరి బాటలోనే నడిచారు. ఆయన నిర్మాతగా ఓ చిన్న సినిమా మొదలైంది. ఇదొక యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అట.

సీనియర్ డైరెక్టర్ కోడిరామకృష్ణ దగ్గర చాలా కాలం పని చేసిన కమల్ నాథ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతన్నాడు. కథ.. తుంగభద్ర.. లాంటి సినిమాల్లో కథానాయకుడిగా నటించిన ఆదిత్ అరుణ్ హీరోగా కనిపించబోతుంటే.. యామిని అనే కొత్తమ్మాయి హీరోయిన్ పాత్ర పోషించబోతోంది. విశేషం ఏంటంటే.. తన ప్రవచనాల ద్వారా లక్షలాది మందికి ఆరాధ్యుడిగా మారిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. ఆయన తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రను చేస్తున్నారట. ఆయన శిష్యుడే అయిన పద్మనాభరావు ఈ చిత్రానికి కథ అందించడం మరో విశేషం. కాకినాడలో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.