Begin typing your search above and press return to search.

నమ్మి ఛాన్సిస్తే నిలబెట్టాడు

By:  Tupaki Desk   |   22 Oct 2021 10:30 AM GMT
నమ్మి ఛాన్సిస్తే నిలబెట్టాడు
X
‘బొమ్మరిల్లు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు భాస్కర్. యూత్, ఫ్యామిలీ అని తేడా లేకుండా అన్ని వర్గాల వారినీ అలరించిన అరుదైన చిత్రమది. ఈ చిత్రంతో భాస్కర్ ఇంటి పేరే ‘బొమ్మరిల్లు’గా మారిపోయింది. అతడిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ ‘బొమ్మరిల్లు’ తర్వాత ఆ స్థాయి సినిమా భాస్కర్ మళ్లీ తీయలేకపోయాడు. రెండో చిత్రం ‘పరుగు’తో కూడా విజయాన్నందుకున్నప్పటికీ.. భాస్కర్ నుంచి ఇంకా ఎక్కువే ఆశించారు జనాలు. మూడో సినిమా ‘ఆరెంజ్’ డిజాస్టర్ కావడంతో భాస్కర్ కెరీర్ తలకిందులైపోయింది. అప్పటిదాకా మంచి డిమాండ్లో ఉన్న వాడు.. ఒక్కసారిగా అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘ఒంగోలు గిత్త’ తర్వాత అయితే భాస్కర్ అడ్రస్ లేకుండా పోయాడు. చాలా ఏళ్లు టాలీవుడ్లో కనిపించలేదు. ఇక మళ్లీ తెలుగులో భాస్కర్ సినిమానే చేయడేమో అనుకుంటే ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

భాస్కర్‌కు ఇంకెక్కడా అవకాశాలు లేని సమయంలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ అతణ్ని నమ్మి అవకాశం ఇచ్చాడు. భాస్కర్‌కు ఈ ఛాన్స్ రావడంలో బన్నీ వాసుది కీలక పాత్ర. కొన్నేళ్ల పాటు రకరకాల కథలతో ప్రయత్నించి చివరికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో అరవింద్‌ను ఒప్పించగలిగాడు భాస్కర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంలో ఆలస్యం జరిగింది కానీ.. మొత్తానికి దసరా సీజన్లో మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేయడం కలిసొచ్చింది. ఇది ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా కాదు కానీ.. ఉన్నంతలో ఓకే అనిపించింది. ‘ఆరెంజ్’ తరహా కథాంశమే అయినా.. దాంతో పోలిస్తే ఎంటర్టైనింగ్‌గా ఈ కథను చెప్పడంతో భాస్కర్ బాక్సాఫీస్ దగ్గర పాసైపోయాడు. ఎక్కడా ఛాన్సుల్లేని సమయంలో తనను నమ్మి అవకాశం ఇచ్చిన అరవింద్‌కు మంచి విజయం అందించి రుణం తీర్చుకున్నాడు. ఇది భాస్కర్ కెరీర్లో గ్రేట్ కమ్ బ్యాక్ అనే చెప్పాలి. ఉమ్మడి ప్రయోజనం దక్కడంతో భాస్కర్, గీతా ఆర్ట్స్ కలయికలో ఇంకో సినిమా రాబోతున్నట్లు సమాచారం.