Begin typing your search above and press return to search.

'పూజ హెగ్డే పాత్రకి ఆ పేరు పెట్టడం వెనుక ఒక సీక్రెట్ ఉంది: 'బొమ్మరిల్లు' భాస్కర్

By:  Tupaki Desk   |   9 Oct 2021 4:30 AM GMT
పూజ హెగ్డే పాత్రకి ఆ పేరు పెట్టడం వెనుక ఒక సీక్రెట్ ఉంది: బొమ్మరిల్లు భాస్కర్
X
లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను తెరపై సహజంగా ఆవిష్కరించే దర్శకులలో 'బొమ్మరిల్లు' భాస్కర్ ఒకరు. 'బొమ్మరిల్లు' తరువాత ఆయన సినిమాలు చేసినప్పటికీ, ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. కొంత గ్యాప్ తరువాత ఆయన ఇప్పుడు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా చేశాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. " ఈ సినిమా అల్లు అరవింద్ గారి ఆశీస్సులతో మొదలైంది. షూటింగ్ అంతా కూడా సాఫీగా సాగిపోయింది. ఈ రోజున ఈ సినిమా ఫంక్షన్ కి చైతూ రావడం చాలా హ్యాపీగా ఉంది.

అఖిల్ వెనుక అక్కినేని అభిమానులు ఎప్పుడూ ఉంటారు. అఖిల్ ను తెలుగు ప్రేక్షకులందరి దగ్గరికి తీసుకువెళ్లాలని ఉద్దేశంతోనే నేను వచ్చాను. ఆయనను అందరికీ మరింత దగ్గర చేయాలనేదే నా ప్రయత్నం. అది ఈ సినిమాతో కచ్చితంగా జరుగుతుంది. అఖిల్ ను మీరు ఒక కొత్త కోణంలో చూసి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక పూజ హెగ్డే విషయానికి వస్తాను. ఆమె నటన చూసి మేమంతా సర్ ప్రైజ్ అయ్యాం .. అలాగే మీరు కూడా సర్ ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో మీరంతా కూడా ఒక కొత్త పూజను చూస్తారు.

ఈ సినిమాలో ఆమె 'విభా' అనే పాత్రను పోషించింది. ఆ పాత్ర పేరు వెనుక ఉన్న ఒక సీక్రెట్ కూడా ఇప్పుడు చెబుతాను. మా పెద్ద డాటర్ పేరు 'హాసిని' .. మా రెండో అమ్మాయి పేరు 'విభా'. పూజ పాత్రకి చాలా ధైర్యంగా నా కూతురు పేరు పెట్టాను. ఈ లోకం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ ను తయారు చేస్తూనే ఉంది. ఈ ప్రయాణంలో ఒక విషయాన్ని మన పేరెంట్స్ మనకి నేర్పలేదు. మనం మన పిల్లలకు నేర్పడం లేదు .. అదేమిటో చెప్పే ఒక ఆసక్తికరమైన ప్రయత్నమే ఈ కథ. అది అందరికీ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను.

ఈ కథ విన్న సిరివెన్నెల సీతారామశాస్త్రికి గారు ఒక మాట అన్నారు. "ఈ కథను నువ్వు కోపంలో రాశావయ్యా. లోకానికి ఎదురెళ్లి ఒక ప్రశ్న అడుగుతున్నావు. కానీ ఆ ప్రశ్న అడగడంలోను ప్రేమ ఉంది" అన్నారు. ఆ ప్రేమ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నా డైరెక్షన్ డిపార్టుమెంటువారు నాతో రెండేళ్లపాటు ట్రావెల్ చేశారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి వాళ్లంతా చాలా కష్టపడ్డారు. అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్న్నాను" అని చెప్పుకొచ్చాడు.