Begin typing your search above and press return to search.

ఆరేళ్లైంది.. 48 గంటలు నిద్ర పోకపోతే ఏం ఫర్లేదులే అమీర్!

By:  Tupaki Desk   |   11 Aug 2022 4:19 AM GMT
ఆరేళ్లైంది.. 48 గంటలు నిద్ర పోకపోతే ఏం ఫర్లేదులే అమీర్!
X
సినీ రంగానికి చెందిన సూపర్ స్టార్లు కొందరు మాట్లాడే మాటలు భలే సిత్రంగా అనిపిస్తుంటాయి. తాము పడే శ్రమ గురించి చాలా గొప్పగా.. కష్టంగా చెబుతుంటారు. తామెంత కష్టపడుతున్నామన్న విషయాన్ని వారు చెప్పే మాటలు కొన్ని విన్నప్పుడు అప్రయత్నంగా నవ్వు వస్తుంటుంది. ఆ మాత్రం కష్టం లేకుండా ఉంటుందా? అన్న సందేహం రాక మానదు.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ.. తన కొత్త సినిమా లాల్ సింగ్ చడ్డా మూవీ రిలీజ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తిరుగుతూ ఉండటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తాను 48 గంటల నుంచి నిద్ర పోలేదంటూ వ్యాఖ్యానించారు.

అమిర్ చివరిగా నటించిన చిత్రం దంగల్. 2016లో రిలీజ్ అయిన ఆ సినిమా తర్వాత విడుదల అవుతున్న పూర్తి స్థాయి అమీర్ఖాన్ మూవీ.. లాల్ సింగ్ చడ్డా. దంగల్ తర్వాత అమిర్ కొన్ని చిత్రాల్లో నటించినా అవన్నీ కూడా సపోర్టింగ్ క్యారెక్టర్లు.. మల్టీ స్టార్ మూవీనే.

దంగల్ తర్వాత అతను నటించిన సినిమాల్ని చూస్తే.. సీక్రెట్ సూపర్ స్టార్.. థంగ్స్ ఆఫ్ హిందుస్థాన్.. కియో జానేనా సినిమాల్లో చేసినా అవన్నీ కూడా పరిమితంగా ఉండే పాత్రలే. పూర్తిస్థాయి మూవీ తాజాగా విడుదల అవుతున్న లాల్ సింగ్ చద్దానే. భారీబడ్జెట్ తో వందలాది కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా అయినప్పుడు.. దానికి సంబంధించిన ఆ మాత్రం కష్టం లేకపోతే ఎలా?
దాన్నో గొప్ప విషయంగా చెప్పుకోవటంలో అర్థం లేదు.

తన ఫోకస్ అంతా సినిమాపైనే ఉందంటూ.. ‘‘రాత్రిళ్లు ఆన్ లైన్ చెస్ ఆగుతున్నా.. పుస్తకాలు చదువుతున్నా.. బ్రెయిన్ మీద ఒత్తిడి ఎక్కువ అవుతోంది.. అసలు నిద్ర పోవటం లేదు’’ చెప్పిన మాటల్ని చూస్తే.. అమిర్ కు నిద్ర పోయే టైం లేకపోవటం కాదు.. ఆయనకు ఒత్తిడి ఎక్కవ కావటంతో సరిగా నిద్ర పోవటం లేదని మాత్రమే అర్థం చేసుకోవాలి.

ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా మీద పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. హిందువులు ఈ మూవీని చూడకూడదంటూ బీజేపీ వర్గాలు ప్రచారం చేయటం తెలిసిందే. దీంతో.. ఆయనకు సినిమారిలీజ్ కు ఉండే టెన్షన్ కు ఇదో పెద్ద టెన్షన్ గా మారినట్లు చెప్పాలి. అత్యుత్తమ స్థానాల్లో ఉన్నప్పుడు ఆ స్థాయిలోనే ఒత్తిడి ఉంటుంది. దాన్ని సమర్థంగా అధిగమించినప్పుడే కదా.. సూపర్ స్టార్ అనేది. ఇప్పటికే ఆ మాటను పేరు ముందు తగిలించుకున్న ఆయన.. అందుకు తగ్గట్లుగా వ్యవహరించకపోతే ఎలా?