Begin typing your search above and press return to search.

సుశాంత్ చనిపోయాడంటే.. ఎవరతను అన్న మీరా చోప్రా

By:  Tupaki Desk   |   15 Jun 2020 8:10 AM GMT
సుశాంత్ చనిపోయాడంటే.. ఎవరతను అన్న మీరా చోప్రా
X
కొన్ని రోజుల కిందట తన ట్విట్టర్ ఫాలోవర్లతో చిట్ చాట్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరో అడిగితే.. ఎవరతను అని ఎదురు ప్రశ్నించి దుమారం రేపింది ముంబయి భామ మీరా చోప్రా. టాలీవుడ్లో సినిమాలు చేసిన టైంలో ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు మీడియాకు చెప్పిందామె. అలాంటిది ఇప్పుడేమో అతనెవరో తెలియనట్లు మాట్లాడటం ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలో వాళ్లు హద్దులు దాటి మాట్లాడారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. వాళ్లందరిపై మీరా పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కొందరిపై కేసులు కూడా నమోదవడం తెలిసిన సంగతే. ఈ వ్యవహారంలో కొంతమేర మీరా తప్పు కూడా ఉన్న మాట వాస్తవం. ఇప్పుడు మరోసారి ఆమె ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లోకి వచ్చింది.

నిన్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీని గురించి ఒక నెటిజన్ మీరాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఐతే దానికామె ఎవరతను అంటూ ఎదురు ప్రశ్న వేసింది. సుశాంత్ విషయంలోనూ ఆమె ఇలాంటి ఎదురు ప్రశ్న వేయడం పట్ల నెటిజన్లు షాకయ్యారు. ఎన్టీఆర్ ఇష్యూతో ముడిపెట్టి మీరా ఎంత యారొగెంటో చూశారా అంటూ ట్వీట్లు వేశారు. ఐతే కాసేపటికి మీరా ఈ ట్వీట్ డెలీట్ చేసినా.. సంబంధిత స్క్రీన్ షాట్లు వైరల్ అయిపోయారు. కొంతసేపటి తర్వాత సుశాంత్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆమె పోస్టులు పెట్టింది.

సుశాంత్ ఎవరంటూ ఆమె ప్రశ్నించిన ట్వీట్ ఎవరైనా కావాలనే క్రియేట్ చేసి పెట్టారేమో అన్న సందేహాలు కూడా కలిగాయి కానీ.. తర్వాత మీరా దీనిపై స్వయంగా వివరణ ఇచ్చింది. సుశాంత్ అనగానే బాలీవుడ్ నటుడు అనే విషయం తనకు గుర్తు రాలేదని.. పైగా అతను ఆత్మహత్య చేసుకోవడం అన్న ఆలోచన ఊహకందనిది అని.. అందుకే అలా బదులిచ్చానంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది.