Begin typing your search above and press return to search.

'#SSMB28' లో కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్..?

By:  Tupaki Desk   |   13 May 2021 12:30 PM GMT
#SSMB28 లో కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ(చినబాబు) ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని నిర్మిస్తున్నారు. వరుస విజయాలతో దూకుడు మీదున్న మహేష్ - 'అల వైకుంఠపురములో' వంటి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే క్రమంలో ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో న్యూస్ వస్తూనే ఉంది. తాజాగా '#SSMB28' లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి నటించనుందని టాక్ వినిపిస్తోంది.

త్రివిక్రమ్ గత చిత్రాలను పరిశీలిస్తే బలమైన లేడీ పాత్రలను క్రియేట్ చేసి అందులో సీనియర్ హీరోయిన్స్ ని నటింపజేస్తూ వస్తున్నాడు. 'అత్తారింటికి దారేది' 'అ ఆ' లలో నదియా.. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో స్నేహ.. 'అజ్ఞాతవాసి' లో ఖుష్బూ.. 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో దేవయాని.. 'అల..'లో టబు పాత్రలు ఉదాహణలుగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర కోసం శిల్పాశెట్టిని తీసుకోబోతున్నారట. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం రూపొందే అవ‌కాశం ఉండ‌టంతో క‌థ‌ను మ‌లుపు తిప్పే ఓ కీ రోల్ శిల్పాశెట్టికి ఇవ్వబోతున్నార‌ని టాక్.

బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ అయిన పొడుగుకాళ్ళ సుందరి శిల్పాశెట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. విక్టరీ వెంకటేష్ తో కలసి 'సాహస వీరుడు సాగర కన్య' సినిమా చేసిన శిల్పా.. కింగ్ అక్కినేని నాగార్జున సరసన 'ఆజాద్' లో నటించి మెప్పించింది. ఇక మోహన్ బాబుతో 'వీడెవడండీ బాబూ'.. నందమూరి బాలకృష్ణ తో 'భలే వాడివి బాసూ' చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ సినిమాలో నటించేది నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.