Begin typing your search above and press return to search.

తనూశ్రీ దత్తా గొడవ.. బాలీవుడ్ విడిపోయింది

By:  Tupaki Desk   |   29 Sept 2018 2:02 PM IST
తనూశ్రీ దత్తా గొడవ.. బాలీవుడ్ విడిపోయింది
X
బాలీవుడ్లో వారం పది రోజులుగా తనూశ్రీ దత్తా చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల గురించే చర్చ నడుస్తోంది. బాలీవుడ్ తో పాటు మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతా గౌరవించే సీనియర్ నటుడు నానా పటేకర్ మీద తనూశ్రీ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. నానా తనతోనే కాదని.. చాలామంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని.. ఆయన అమ్మాయిల్ని కొడతాడని.. తిడతాడని.. చాలా తక్కువగా చూస్తాడని కూడా ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణల్ని నానా ఖండించినా.. ఆయనకు మద్దతుగా కొందరు మాట్లాడినా తనూశ్రీ తగ్గలేదు. తన స్వరాన్ని మరింత పెంచింది. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మీద కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా అతను సెట్లో తనను ఇబ్బందికర రీతిలో కనిపించాలని ఒత్తిడి చేశాడని.. అసభ్యంగా తిట్టాడని ఆమె ఆరోపించింది. మరోవైపు నానాను వదలకుండా అతడిపై విమర్శలు కొనసాగిస్తూనే ఉందామె.

తనూశ్రీ ఆరోపణల విషయంలో బాలీవుడ్ భిన్నంగా స్పందిస్తోంది. కొందరు నానా వైపు నిలిస్తే.. ఇంకొందరు తనూశ్రీని సపోర్ట్ చేశారు. నానా వైపు ఉన్న వాళ్లు ఆయన అలాంటి వాడు కాదు అంటున్నారు. తనూశ్రీ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తోందని.. ఈ ఆరోపణలన్నీ నిజమైతే ఆమె పదేళ్ల పాటు మౌనం వహించి ఇప్పుడెందుకు మాట్లాడుతోందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఐతే దీనిపై తనూశ్రీ స్పందించింది. తాను అప్పుడే కెరీర్లో తొలి అడుగులు వేస్తున్నానని.. కెరీర్ కోసం మాట్లాడలేకపోయానని.. భయపడ్డానని పేర్కొంది. ఈ విషయంలో చాలామంది ఆమెకు మద్దతుగా నిలిచారు. తనూశ్రీ అప్పటికి అశక్తురాలని.. కెరీర్ గురించి భయపడి ఉండొచ్చని.. ఒక అమ్మాయి తాను ఇబ్బందులు పడ్డాక ఎన్నేళ్ల తర్వాత అయినా గళం విప్పవచ్చని.. ఆమెకు 60 ఏళ్ల వయసు వచ్చాక మాట్లాడినా మనం వినాలని.. మద్దతుగా నిలవాలని.. అంతే తప్ప చెత్త లాజిక్స్ తీయకూడదని అంటున్నారు తనూశ్రీ మద్దతుదారులు. మరి మున్ముందు ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.