Begin typing your search above and press return to search.

క్రేజీ సీజన్.. బాలీవుడ్ చేతులెత్తేసిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   20 Oct 2022 8:00 AM IST
క్రేజీ సీజన్.. బాలీవుడ్ చేతులెత్తేసిన‌ట్టేనా?
X
ద‌క్షిణాది సినిమాల‌కు ప్ర‌ధాన సీజ‌న్ లు సంక్రాంతి, ద‌స‌రా, దీపావళి. ఈ సీజ‌న్‌ల‌లో సినిమాల‌ని రిలీజ్ చేయాల‌ని మ‌రీ ముఖ్యంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ సినీ వ‌ర్గాలు పోటీప‌డుతుంటాయి. ఎదుకంటే ఈ సీజ‌న్ లో విడ‌ద‌ల‌య్యే సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద‌ భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతుంటాయి. దీంతో ప్ర‌తీ హీరో, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఈ మూడు సీజ‌న్ ల‌ని టార్గెట్ చేస్తూ సినిమాల‌ని రిలీజ్ చేస్తుండ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఇదిలా వుంటే బాలీవుడ్ లో మాత్రం దీపావ‌ళిని మాత్ర‌మే టార్గెట్ చేస్తూ భారీ సినిమాల‌ని విడుద‌ల చేస్తూ వుంటుంటారు. కార‌ణం ఈ సీజ‌న్ లో విడుద‌ల‌య్యే సినిమాలు దేశ వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల్ని సృష్టిస్తుంటాయి. ఇది గ‌త కొన్నేళ్లుగా జ‌రుగుతూనే వుంది. ఈ సీజ‌న్ లో అత్య‌ధికంగా స‌ల్మాన్ ఖాన్‌, అక్ష‌య్ కుమార్‌, అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన సినిమాలు విడుద‌లై భారీ విజ‌యాల్ని ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టాయి.

అలాంటి సీజ‌న్ త్వ‌ర‌లో రానున్న నేప‌థ్యంలో బాలీవుడ్ వ‌ర్గాలు కంప్లీట్ గా చేతులెత్తేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. గ‌తంలో ఈ సీజ‌న్ లో విడుద‌లైన సినిమాలు రూ. వంద కోట్ల‌కు పైనే వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన దాఖ‌లాలు చాలానే వున్నాయి. అలాంటి సీజ‌న్ ని బాలీవుడ్ ఈ ఏడాది లైట్ తీసుకోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. దీపావ‌ళికి అక్ష‌య్ కుమార్ న‌టించిన `రామ్ సేతు`, అజ‌య్ దేవ్ గ‌న్‌, సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా క‌లిసి న‌టించిన `థాంక్ గాడ్‌` రిలీజ్ కాబోతున్నాయి.

అయితే ఈ సినిమాల‌పై బాలీవుడ్ లో ఏమాత్రం బ‌జ్ క‌నిపించ‌డం లేదు. ప్రేక్ష‌కుల్లోనూ ఈ మూవీపై ఆస‌క్తి లేక‌పోవ‌డంతో మేక‌ర్స్ కూడా ప్ర‌మోష‌న్స్ పై పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌డం లేదు. ఎక్క‌డా పెద్ద‌గా ప్ర‌మోట్ చేయ‌డం లేదు. `రామ్ సేతు`ని ప్ర‌మోట్ చేస్తే ఈ టైమ్ లో భారీగా ప్రేక్ష‌కుల్లో అటెన్ష‌న్ ని క్రియేట్ చేయ‌డం గ్యారంటీ. కానీ మేక‌ర్స్ మాత్రం ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకోవ‌డం లేదు.. ప్ర‌మోష‌న్స్ పై దృష్టి పెట్ట‌డం లేదు.

దేశ వ్యాప్తంగా శ్రీ‌రాముడిపై వున్న భ‌క్తిని ఈ సినిమాకు ఉప‌యోగించుకునే వీలున్నా కూడా మేక‌ర్స్ ఎందుకు వెన‌క‌డుగు వేస్తున్నారో ఎవ‌రికీ పెద్ద‌గా అర్థం కావ‌డం లేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో పోలిస్తే అజ‌య్ దేవ్ గ‌న్‌, సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా క‌లిసి న‌టించిన `థాంక్ గాడ్‌` ప‌రిస్థితి కాస్త మెరుగ్గా వుంది. ఇటీవ‌లే నోరా ఫ‌తే, సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా పై చిత్రీక‌రించిన రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేసి సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించారు. ఈ రెండు సినిమాలూ అక్టోబ‌ర్ 25నే విడుద‌ల‌కానున్నాయి.

తాజా స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ఈ రెండు సినిమాల‌కు ఆశించిన స్థాయి ఓపెనింగ్స్ రావ‌డం క‌ష్ట‌మ‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రేక్ష‌కులు ద‌క్షిణాది సినిమాల‌కు ఎడిక్ట్ అవుతున్న నేప‌థ్యంలో ఈ రెండు సినిమాల్లో విష‌యం లేక‌పోతే డిజాస్ట‌ర్లు గా తేల్చేయ‌డం ఖాయం అని ఇదే జ‌రిగితే అక్క‌డ విడుద‌లైన `కాంతారా` కాసుల వ‌ర్షం కురిపిస్తుంద‌ని అక్క‌డి ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.