Begin typing your search above and press return to search.

మెల్లమెల్లగా ట్రాక్ లోకి వస్తోన్న బాలీవుడ్..!

By:  Tupaki Desk   |   21 March 2022 2:30 AM GMT
మెల్లమెల్లగా ట్రాక్ లోకి వస్తోన్న బాలీవుడ్..!
X
బాలీవుడ్ నుంచి గత కొంతకాలంగా చెప్పుకోదగ్గ సినిమాలు రావడం లేదనే చెప్పాలి. ఒకటీ అర చిత్రాలు తప్ప ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న హిందీ సినిమాలు లేవు. మరోవైపు సౌత్ చిత్రాలు జాతీయ స్థాయిలో సత్తా చూటుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్ సినిమాపై దక్షిణాది ఆధిపత్యం కొనసాగుతోంది.

అయితే కరోనా పాండమిక్ తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా మెల్లమెల్లగా పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. గతేడాది థియేట్రికల్ రిలీజ్ అయిన హిందీ చిత్రాల్లో అక్షయ్ కుమార్ నటించిన 'సూర్యవంశీ' సినిమా ఒక్కటే సూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'గంగూబాయి కతియావాడి' చిత్రం శుభారంభాన్ని ఇచ్చింది.

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ''గంగుబాయి'' చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలోకి వచ్చింది. అనూహ్యంగా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.. ఇండియాలోనే కాకుండా ఆస్ట్రేలియాలోనూ అలరించింది. ఈ క్రమంలో కరోనా థర్డ్ వేవ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్క్ అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది.

ఇక మార్చి 11న 'రాధేశ్యామ్' చిత్రానికి పోటీగా థియేటర్లలోకి వచ్చిన వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ''ది కాశ్మీర్ ఫైల్స్'' సినిమా అంచనాలకు మించి వసూళ్ళు రాబడుతోంది. అంతగా ప్రీ-రిలీజ్ బజ్ లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజు రూ. 4.25 కోట్లు వచ్చాయి. అయితే ఆశ్చర్యకరంగా 2వ రోజు 10.10 కోట్లు మరియు 3వ రోజు రూ. 17.25 కోట్లు.. ఇలా రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతూనే వస్తోంది.

ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం.. రివ్యూలు సానుకూలంగా ఉండటంతో 'కాశ్మీర్ ఫైల్స్' సినిమా మొదటి వారంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్ళు అందుకుంది. ఈ వారంలో 150 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫైనల్ రన్ ముగిసే సమయానికి రికార్డు స్థాయి కలెక్షన్స్ గ్యారంటీ అని భావిస్తున్నారు.

ఇదే క్రమంలో శుక్రవారం (మార్చి 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ''బచ్చన్ పాండే'' సినిమా కూడా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. 'జిగర్తాండ' (తెలుగులో 'గద్దల కొండ గణేష్') రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు. కృతి సనన్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు అర్షద్ వార్సి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఫస్ట్ డే 13.25 కోట్లు రాబట్టినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో కరోనా పాండమిక్ తర్వాత అత్యధిక ఓపెనింగ్ డే వసూళ్ళు అందుకున్న రెండో సినిమాగా 'బచ్చన్ పాండే' నిలిచింది. టాక్ ని బట్టి చూస్తే ఈ వారాంతంలో అక్షయ్ సినిమా మరిన్ని కలెక్షన్స్ అందుకుంటుందని అంచనా వేయిచ్చు.

రాబోయే రోజుల్లో హిందీలో పలు క్రేజీ చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఏప్రిల్ 1న జాన్ అబ్రహం - రకుల్ ప్రీత్ సింగ్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కలిసి నటించిన 'ఎటాక్' సినిమా రిలీజ్ కాబోతోంది. అలానే షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జెర్సీ' చిత్రం ఏప్రిల్ 14న రాబోతోంది. ఇది తెలుగు 'జెర్సీ' కి అధికారిక హిందీ రీమేక్.

ఇక ఏప్రిల్ 29న అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ - రకుల్ ప్రీత్ సింగ్ తో కలసి నటించిన 'రన్ వే 34' సినిమా విడుదల కానుంది. ఇదే క్రమంలో 'హీరోపంటి 2' 'భూల్ బులయ్యా 2' 'మైదాన్' 'పృథ్వీరాజ్' 'మిషన్ మజ్ను' 'డాక్టల్ జి' వంటి పలు హిందీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి వీటిల్లో ఎన్ని బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపుతాయో చూడాలి.