Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో రాణించిన బాలీవుడ్ హీరోయిన్లు...!

By:  Tupaki Desk   |   29 May 2021 10:00 AM IST
టాలీవుడ్ లో రాణించిన బాలీవుడ్ హీరోయిన్లు...!
X
సినీ ఇండస్ట్రీలో నటీనటులకు భాషతో సంబంధం లేదు. ముఖ్యంగా హీరోయిన్లు కేవలం ఒక భాషకే పరిమితమవకుండా.. అవకాశం వచ్చినప్పుడు ఇతర ఇండస్ట్రీలకు పయనం అవుతుంటారు. అలా టాలీవుడ్ కు వచ్చిన ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. తమిళ మలయాళ కన్నడ హిందీ ఇండస్ట్రీల నుంచి వచ్చిన చాలా మంది నటీమణులు మన తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ నుండి వస్తున్న కథానాయికలు ఇక్కడ స్టార్ హీరోయిన్స్‌ గా నిరూపించుకున్నారు. తెలుగు సినిమాల్లో సత్తా చాటిన బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం!

హిందీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నగ్మా.. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లపాటు హవా కొనసాగించింది. 'పెద్దింటి అల్లుడు' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మా.. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. 'కిల్లర్' 'ఘరానా మొగుడు' 'వారసుడు' 'మేజర్ చంద్రకాంత్' 'ముగ్గురు మొనగాళ్లు' 'కొండపల్లి రాజా' వంటి సినిమాలు నగ్మా ను తెలుగు ఆడియన్స్ ఆమెను గుర్తించుకునేలా చేశాయి.

'కూలీ నెం.1' సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సీనియర్ హీరోయిన్ టబు. 'నిన్నేపెళ్లాడుతా' సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిన టబు.. 'ఆవిడా మా ఆవిడే' 'పాండురంగడు' 'చెన్నకేశవ రెడ్డి' 'అందరివాడు' 'ఇదీ సంగతి' వంటి చిత్రాల్లో నటించింది. ఆమె తెలుగులో హీరోయిన్ గా చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇటీవల 'అల వైకుంఠపురములో' సినిమాతో మరోసారి తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.

'క్రిమినల్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన నేపాలీ బ్యూటీ మనీషా కోయిరాలా. చేసింది ఒక్క తెలుగు సినిమానే అయినా ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసింది. 'భారతీయుడు' 'బొంబాయి' 'బాబా' వంటి డబ్బింగ్ సినిమాలతో మెప్పించిన మనీషా.. 'నగరం' అనే తెలుగు సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇటీవల '99' సినిమాతో మరోసారి పలకరించింది.

బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే 'మురారి' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. 'ఇంద్ర' 'ఖడ్గం' 'పల్నాటి బ్రహ్మనాయుడు' 'మన్మథుడు' 'శంకర్ దాదా ఎంబీబీఎస్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. 'ప్రేమంటే ఇదేరా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రీతీ జింటా.. 'రాజకుమారుడు' సినిమాతో ఆకట్టుకుంది. తెలుగులో రెండు సినిమాలు మాత్రమే చేసిన ప్రీతి, వాటితోనే ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది.

'ప్రేమించుకుందాం రా' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అంజలా ఝవేరీ. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన 'చూడాలని ఉంది' 'సమరసింహారెడ్డి' 'రావోయి చందమామ' 'దేవిపుత్రుడు' వంటి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో గెస్ట్ రోల్ చేసి అలరించింది.

'ఇష్టం' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియ సరన్.. 20 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతోంది. అందంతో పాటు అభినయం క‌ల‌బోసిన న‌టీమ‌ణుల్లో ముందు వ‌రుస‌లో ఉండే శ్రియా.. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. 'నువ్వే నువ్వే' 'సంతోషం' 'నేనున్నాను' 'ఠాగూర్' 'చెన్నకేశవ రెడ్డి' 'గౌతమీ పుత్ర శతకర్ని' 'గోపాల గోపాల' వంటి సినిమాలతో మెప్పించింది. ఇప్పటికీ లీడ్ రోల్స్ లో నటిస్తూ కుర్ర భామలకు పోటీగా నిలుస్తోంది. ప్రస్తుతం 'గమనం' అనే సినిమాలో నటిస్తోంది.

'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన కాజల్ అగర్వాల్.. వరుస అవకాశాలు అందుకుంటూ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 'చందమామ' 'మగధీర' 'ఆర్య 2' 'డార్లింగ్' 'బృందావనం' 'మిస్టర్ పర్ఫెక్ట్' 'బిజినెస్ మాన్' 'బాద్‍ షా' 'ఎవడు' 'టెంపర్' 'ఖైదీ నెం 150' సినిమాలతో సత్తా చాటింది. కొత్త హీరోయిన్స్ ఎంతమంది వస్తున్నా తనకంటూ ప్లేస్ ఏర్పరచుకుంది. ప్రస్తుతం 'ఆచార్య' సినిమాతో పాటుగా నాగార్జున సరసన ఓ సినిమాలో నటిస్తోంది.

మిల్కీ బ్యూటీ తమన్నా 'శ్రీ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. స్టార్ హీరోలందరితో నటించిన తమన్నా.. ఇప్పటికీ వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఓవైపు సీనియర్ హీరోలతో మరోవైపు కుర్ర హీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఇండస్ట్రీలోకి కొత్త కుర్ర హీరోయిన్లకు ఎంతమంది వస్తున్నా తమన్నా జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్రస్తుతం 'ఎఫ్ 3' 'గుర్తుందా శీతాకాలం' 'అంధాదున్' తెలుగు రీమేక్ లలో నటిస్తోంది.