Begin typing your search above and press return to search.

బాహుబలి-2పై వాళ్లు స్పందించరేంటి?

By:  Tupaki Desk   |   4 May 2017 11:55 AM GMT
బాహుబలి-2పై వాళ్లు స్పందించరేంటి?
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ సాగిస్తున్న వసూళ్ల ప్రభంజనం చూసి దేశమంతా విస్తుబోతోంది. ఇప్పటిదాకా ఇండియా మొత్తంగా కలెక్షన్ల రికార్డులు తీస్తే బాలీవుడ్ సినిమాలకే హవా ఉండేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు లైఫ్ టైంలో సాధించిన వసూళ్లను వారం లోపే అధిగమించేసి సంచలనం సృష్టిస్తోంది ‘బాహుబలి: ది కంక్లూజన్’. ఐతే బాహుబలి-2 ఈ స్థాయిలో విజృంభిస్తుంటే.. బాలీవుడ్ ప్రముఖులెవ్వరూ కూడా ఆ సినిమా గురించి ఏం మాట్లాడుకుండా మౌనం వహిస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది. అదే అమీర్ ఖాన్ సినిమానో.. సల్మాన్ ఖాన్ సినిమానో ఇలా వసూళ్ల వర్షం కురిపిస్తుంటే బాలీవుడ్ ఊగిపోయేది. ఆహా ఓహో అంటూ ట్వీట్ల వర్షం కురిపించేది. పోయినేడాది ఆఖర్లో ‘దంగల్’ విడుదలైనపుడు బాలీవుడ్డోళ్లు ఎలా స్పందించారో గుర్తుండే ఉంటుంది.

కానీ కరణ్ జోహార్ లాంటి బడా ప్రొడ్యూసర్.. బాహుబలి-2ను రిలీజ్ చేసినప్పటికీ ఆయనకు అత్యంత ఆత్మీయులైన వాళ్లు కూడా ఈ సినిమా గురించి స్పందించట్లేదు. రిలీజ్ కు ముందు రోజు అనుకున్న ప్రకారం ప్రీమియర్ షో పడి ఉంటే దానికి హాజరైన వాళ్లందరూ ట్విట్టర్లో స్పందించక తప్పని కంపల్షన్ ఉండేది. ఆ షో రద్దవడంతో అందరూ సైలెంటైపోయారు. అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్ మాత్రమే కాదు.. హృతిక్ రోషన్.. అక్షయ్ కుమార్.. రణబీర్ కపూర్.. రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోలు కానీ.. స్టార్ హీరోయిన్లు కానీ ఈ సినిమాపై స్పందించింది లేదు. శేఖర్ కపూర్ లాంటి వాళ్లు ఎంతగా ఈ సినిమాను పొగిడినప్పటికీ... లైమ్ లైట్లో ఉన్న స్టార్ హీరో హీరోయిన్లు.. దర్శకులు ‘బాహుబలి-2’ గురించి స్పందించకపోవడం చూస్తే.. వాళ్లందరూ ఈ సినిమా ప్రభంజనాన్ని చూసి అసూయ చెందుతున్నట్లే భావించాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/