Begin typing your search above and press return to search.

సొంత గొంతుతోనే బాలీవుడ్ ఎంట్రీ..?

By:  Tupaki Desk   |   10 Nov 2021 3:49 AM GMT
సొంత గొంతుతోనే బాలీవుడ్ ఎంట్రీ..?
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' చిత్రంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. దాన్ని నిలబెట్టుకునే దిశగా కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ పోతున్న VD.. ఇప్పుడు 'లైగర్' చిత్రంతో నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ''లైగర్''. ఇది విజయ్ కే కాదు పూరీకి కూడా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటుగా తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీతో సాలిడ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని వీడీ ప్లాన్ చేసుకుంటున్నారు. దీని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

'సాలా క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్ లైన్ తో మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో 'లైగర్' సినిమా రూపొందుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్ గా కనిపించనున్నారు. దీని కోసం కఠినమైన శిక్షణ తీసుకొని పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ లుక్ - హావభావాలు - డైలాగ్ డెలివరీ కొత్తగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం హిందీలోనూ వీడీ సొంత గొంతుతోనే మాట్లాడతారట.

'లైగర్' సినిమాతో బాలీవుడ్ లో సత్తా చాటాలని గట్టిగా ఫిక్స్ అయిన విజయ్ దేవరకొండ.. హిందీలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. దీని కోసం గత రెండేళ్లుగా హిందీ మీద పట్టు సాధించడానికి చాలా కష్టపడుతున్నాడని టాక్. ఫస్ట్ సినిమాతోనే సొంత వాయిస్ తో చేస్తే తొలి అడుగు స్ట్రాంగ్ గా పడే అవకాశం ఉంది. మరి విజయ్ నిజంగా హిందీలోకి సొంత గొంతుతో వెళ్తారా లేదా అనేది చూడాలి.

మార్కెట్ పరంగా నార్త్ లో ప్రభావం చూపడానికి పూరీ జగన్నాథ్ తో పాటుగా.. కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ ప్రొడ్యూసర్ సహకారం విజయ్ దేవరకొండ కు ఉంది. ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాననే ధీమాగా కూడా ఉన్నారు. అనన్య పాండే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో య్యూఎస్ షెడ్యూల్ లో 'లైగర్' టీమ్ రెడీ అవుతోంది. అక్కడ టైసన్ - విజయ్ పాల్గొనే కొన్ని సీన్స్ ని షూట్ చేయనున్నారు. ఈ క్రమంలో రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేస్తారు.

ఇక విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ విషయానికొస్తే.. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో రూపొందించిన ''పుష్పక విమానం'' సినిమా నవంబర్ 12న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషనల్ కార్యక్రమాలతో అన్నదమ్ములు ఈ సినిమాపై బజ్ క్రియట్ చేశారు. మరి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.