Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: డిఎఫ్‌ఎస్‌ కు రియా - దీపికా సహా 15మంది ఫోన్లు...?

By:  Tupaki Desk   |   16 Oct 2020 1:20 PM IST
డ్రగ్స్ కేసు: డిఎఫ్‌ఎస్‌ కు రియా - దీపికా సహా 15మంది ఫోన్లు...?
X
బాలీవుడ్ లో అనూహ్యంగా వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం యావత్ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసుని సీబీఐ విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ కోణం బయటకు వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురిని అరెస్ట్ చేసి విచారించారు. అయితే దాదాపు నెల రోజుల పాటు జనులలో ఉన్న రియాకు ఇటీవలే బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఎన్సీబీ ఇప్పటికే స్టార్ హీరోయిన్లు దీపిక పదుకొనే - సారా అలీఖాన్ - రకుల్ ప్రీత్ సింగ్ - శ్రద్ధా కపూర్ లను కూడా విచారించారు. అలానే టాలెంట్ మేనేజర్ జయ సాహా మరియు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ లను కూడా ప్రశ్నించారు. కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కున్న వారి నుంచి పర్సనల్ మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సెలబ్రిటీల నుంచి తీసుకున్న 15 ఫోన్లను విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం గాంధీ నగర్‌ లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ (డిఎఫ్‌ఎస్)కు ఆ మొబైల్ ఫోన్స్ పంపినట్లు సమాచారం. అక్కడ తొలగించబడిన చాట్‌ హిస్టరీ మరియు వీడియోలకు సంబంధించి దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. సెలబ్రిటీల ఫోన్లతో పాటు జయ సాహా - కరిష్మా ప్రకాష్ ఫోన్లు కూడా పంపబడ్డాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తితో పాటు మేనేజ‌ర్‌ శామ్యూల్‌ మిరిండా మరియు దీపేశ్‌ సావంత్‌ లు కూడా బెయిల్ పై విడుదలయ్యారు. ఐతే రియా సోదరుడు షోయిక్‌ చక్రవర్తికి మాత్రం బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయలేదు.