Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో వీచిన సెకండ్ వేవ్.. టాలీవుడ్ గుర్తించిందా?

By:  Tupaki Desk   |   31 March 2021 12:00 PM IST
బాలీవుడ్ లో వీచిన సెకండ్ వేవ్.. టాలీవుడ్ గుర్తించిందా?
X
కరోనా మహమ్మారి ముంచుకొచ్చింది. సర్కారు లాక్ డౌన్ విధించింది. రోజూ బిజీబిజీగా ఉండే తారలు ఇంటికే పరిమితమయ్యారు. అన్ లాక్ మొదలు కావటం.. ప్రభుత్వం పచ్చ జెండా ఊపటంతో మళ్లీ షూటింగ్ లు మొదలయ్యాయి. నెమ్మదిగా అందరూ బిజీ అవుతున్నారు. ఇలాంటివేళలోనే.. అంతా ఓకే అనుకుంటున్న వేళ సెకండ్ వేవ్ రూపంలో షాక్ మొదలైంది. దేశంలోని మరే వుడ్ లో లేని రీతిలో బాలీవుడ్ లోని సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు చొప్పున పాజిటివ్ గా తేలుతున్నారు.

దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఉండే బాలీవుడ్ కు సెకండ్ వేవ్ షాక్ భారీగా తగులుతోంది. దీంతో.. నెగిటివ్ రిపోర్టు పట్టుకొని షూటింగ్ లో పాల్గొంటున్నారు కొద్దిరోజులకే పాజిటివ్ ఫలితంతో సినిమాలకు దూరమవుతున్నారు. ఇంట్లోనో.. ఆసుపత్రిలోనో చేరి చికిత్స తీసుకుంటున్నారు. నెల వ్యవధిలో దాదాపు పది మందికి పైగా బాలీవుడ్ స్టార్లు పాజిటివ్ గా తేలటం చూస్తే.. సెకండ్ వేవ్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

బాలీవుడ్ కు ఎదురవుతున్నషాకుల్ని టాలీవుడ్ గుర్తిస్తుందా? జాగ్రత్తలు తీసుకుంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్న బాలీవుడ్ స్టార్లు.. ఒకరు తర్వాత ఒకరు చొప్పున పాజిటివ్ గా మారుతున్నారు. గడిచిన రెండు వారాల్లో పలువురు బాలీవుడ్ తారలు కరోనా బారిన పడగా.. తాజాగా దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ పాజిటివ్ గా పేర్కొన్నారు. తనకు కరోనా పాజిటివ్ కన్ఫర్మ్అయినట్లు చెప్పిన ఆమె.. తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్లు చెప్పారు.

ఆమె కంటే ఒక్కరోజు ముందే యువ హీరో విక్రాంత్ మెస్సీ కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. దీంతో అతను నటిస్తున్న సినిమా షూటింగ్ ను నిలిపివేశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత షూటింగ్ లు మొదలైన బాలీవుడ్ లో ఇటీవల కాలంలో పలువురు కరోనా బారిన పడతున్నారు. సీనియర్ నటుడు పరేశ్ రావల్ వ్యాక్సిన్ వేయించుకొని మరీ షూటింగ్ లకు హాజరయ్యారు. కానీ.. ఆయన పాజిటివ్ బారిన పడ్డారు. అగ్రనటులు అమీర్ ఖాన్.. మాధవన్ .. మనోజ్ బాజ్ పేయ్.. రణ్ బీర్ కపూర్..మనోజ్ బాజ్ పేయ్.. సిద్ధార్థ్ చతుర్వేది.. తారా సుతారియా.. ఇలా పలువురు నటులే కాదు.. సంజయ్ లీలా భన్సాలీ.. అమిత్ శర్మ లాంటి దర్శకులు సైతం పాజిటివ్ బారిన పడ్డారు.

ఇదంతా చూసినప్పుడు బాలీవుడ్ కు సెకండ్ వేవ్ ఇచ్చిన షాక్ చాలా స్ట్రాంగ్ గానే తగిలిందని చెప్పాలి. బాలీవుడ్ కు ఎదురవుతున్న పాజిటివ్ కేసుల్ని టాలీవుడ్ గమనిస్తుందా? ఇప్పటికే కరోనా కారణంగా ఇండస్ట్రీకి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఒక అగ్ర నటుడికి పాజిటివ్ గా మారితే.. దాని ప్రభావం వందల మంది మీద ఉంటుంది.

కరోనా తర్వాత పెద్ద నటులంతా వరుస సినిమాలు చేస్తున్నారు. గతంలో మాదిరి ఒక చిత్రం చేయటం.. గ్యాప్ ఇచ్చి మరొకటి చేయటం లాంటివి కాకుండా.. వరుస పెట్టి చిత్రాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మధ్యలో ‘పాజిటివ్’ బ్రేక్ పడితే జరిగే నష్టం అంతా ఇంతా కాదన్నది మర్చిపోకూడదు.బాలీవుడ్ కు తగులుతున్న పాజిటివ్ షాకుల్ని గుర్తించి.. టాలీవుడ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనసరి. లేదంటే పరిశ్రమ తీవ్ర ప్రభావానికి గురి కావటం ఖాయం.