Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో ‘కంగన’ మంటలు

By:  Tupaki Desk   |   17 Sept 2015 7:00 PM IST
బాలీవుడ్ లో ‘కంగన’ మంటలు
X
కంగనా రనౌత్ సంగతి తెలిసిందే. నోటికేదొస్తే అది మాట్లాడేస్తుంది. తనను మించిన వాళ్లు లేరంటుంది. మిగతా వాళ్లు నా ముందు ఎంత అంటుంది. ఎవరినీ లెక్కచేయనంటుంది. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే టైపు మాటలు ఆమెకు అస్సలు నచ్చవు. కొంచెం పేరు వచ్చినప్పటికీ నుంచి ఎగిరెగిరి పడుతూనే ఉంది. అందులోనూ గత రెండేళ్లుగా తిరుగులేని పాత్రలతో బాలీవుడ్ బెస్ట్ యాక్స్ట్రెస్ అన్న గుర్తింపు తెచ్చుకునేసరికి అమ్మడిని ఆపడం కష్టమవుతుంది.

ఈ మధ్యే తన తోటి హీరోయిన్ల గురించి మరీ శ్రుతి మించి మాట్లాడింది కంగన. తాను పోషించిన పాత్రలు ఇంకెవరైనా చేయగలరా.. తను వెడ్స్ మనులో నేను వేసిన రెండు పాత్రలు చేసే దమ్ము ఎవరికైనా ఉందా అంటూ సవాలు విసరడంతో బాలీవుడ్ జనాలకు చిర్రెత్తుకొచ్చేస్తోంది. ఇన్నాళ్లూ కంగన అంతేలే అదో టైపు అని వదిలేశారు కానీ.. ఇప్పుడు జనాల నుంచి తిట్ల వర్షం మొదలైంది. సీనియర్ నటి దివ్య దత్తా లాంటి వాళ్లు కంగనను దులిపేశారు. ఎవరికైనా సరైన సమయంలో సరైన అవకాశం రావడం ముఖ్యమని.. కంగనకు అలా అవకాశం వచ్చింది కాబట్టే తన టాలెంట్ చూపించిందని.. ఐతే ఆమె చుట్టూ ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులున్నారన్న మాట గుర్తుంచుకోవాలని.. మరీ మిడిసిపడొద్దని దివ్య దత్తా కంగనకు క్లాస్ పీకింది. ఇంకా కొందరు దివ్యతో గొంతు కలిపారు.

అయినప్పటికీ కంగనలో ఏ మార్పూ లేదు. జనాల్ని మెప్పించేలాగో, వారిని హర్ట్ చేసేలాగో స్టేట్ మెంట్లు ఇవ్వడానికి నేనేం రాజకీయ నాయకురాలిని కాదు.. నాకేదనిపిస్తే అది మాట్లాడతా.. అంటూ పెడసరంగా మాట్లాడింది కంగన. దీంతో వరుసగా రెండు మూడు ఫ్లాపులొస్తే తప్ప కంగన దారిలోకి రాదంటూ ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు బాలీవుడ్ జనాలు.