Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్ ను ఓ పట్టానా వదిలేలా లేరే!

By:  Tupaki Desk   |   29 May 2022 1:30 PM GMT
జాన్వీ కపూర్ ను ఓ పట్టానా వదిలేలా లేరే!
X
ఇప్పుడు తెలుగులో ఏ హీరో .. ఏ దర్శకుడితో సినిమాను మొదలెట్టినా హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరే వినిపిస్తోంది. అలాగని చెప్పేసి బాలీవుడ్ లో ఆమె భారీ సక్సెస్ లు ఇస్తూ మార్కెట్ ను ఒక ఊపు ఊపేస్తుందా అంటే అదీ లేదు. ఆమె ఎక్కడో ఒక చోట చిట్టి పొట్టి నిక్కర్లతో మెరవడం .. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడమే ఎక్కువ. చేతిలో భారీ ప్రాజెక్టులు .. హ్యాండ్ బ్యాగులో హిట్లు లేకపోయినా శ్రీదేవి కూతురుగా ఆమెకి కావలసినంత పాప్యులారిటీ అయితే ఉంది .. యూత్ లో అనుకున్నదానికంటే ఎక్కువ ఫాలోయింగే ఉంది.

ఇక జాన్వీ కపూర్ తమ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం కావలనే ఉద్దేశం .. ఉత్సాహం ఇక్కడి మేకర్స్ కి నిండుగా .. మెండుగా ఉన్నాయి. అందువలన స్టార్ హీరోలతో ప్రాజెక్టు మొదలుపెట్టడమే మొదలు హీరోయిన్ గా ముందుగా జాన్వీ కపూర్ పేరును పరిశీలిస్తున్నారు.

అంతకుముందు మహేశ్ బాబు .. చరణ్ .. రీసెంట్ గా విజయ్ దేవరకొండ సరసన కూడా జాన్వీ కపూర్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. మన శ్రీదేవి కూతురు మన తెలుగులో చేస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఆ వార్తలన్నీ ప్రచారాలుగానే మిగిలిపోయాయి. ఆ ప్రచారాల దగ్గరే అభిమానుల ఆశలన్నీ ఆగిపోయాయి.

ఇక ఇప్పడు ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ సినిమాకి సంబంధించి జాన్వీ కపూర్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. 'భరత్ అనే నేను' సినిమాతో కియారాను టాలీవుడ్ కి పరిచయం చేసిన కొరటాల, ఈ ప్రాజెక్టుకి కూడా ఆమెనే తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఆ తరువాత అలీయా .. రష్మిక పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ జాన్వీ కపూర్ తో కొరటాల సంప్రదింపులు జరుపుతున్నట్టుగా బలమైన టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ఆమెను ఒప్పించేయడం జరిగిపోయిందని అంటున్నారు.

మంచి కథ .. పాత్ర దొరికితే తెలుగు సినిమాలు చేయడానికి జాన్వీ రెడీగా ఉందని కొంతకాలంగా బోనీ కపూర్ చెబుతూ వస్తున్నారు. తెలుగు సినిమాలంటే తనకి చాలా ఇష్టమని జాన్వీ చెబుతూ వస్తోంది. కానీ తెలుగులో ఏ ఒక్క ప్రాజెక్టును ఓకే చేయడం లేదు. మరి ఈ సారైనా ఆమె ఓకే చెప్పిందనే వార్తలో ఎంతవరకూ వాస్తవముందనేది చూడాలి. మొత్తానికి ఏదో ఒక తెలుగు సినిమా ఒప్పుకునేంత వరకూ పుకారిస్టులు ఆమెను వదిలేలా లేరు. కల్యాణ్ రామ్ .. మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.