Begin typing your search above and press return to search.

బిత్తిరి సత్తి.. వెండితెర మీదా మెరుపులే

By:  Tupaki Desk   |   26 Feb 2017 10:20 AM GMT
బిత్తిరి సత్తి.. వెండితెర మీదా మెరుపులే
X
బిత్తిరి సత్తి.. ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు తెలియని వాళ్లుండరేమో. వి-6 ఛానెల్లో వచ్చే తీన్మార్ షోతో విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు సత్తి. ముందు తెలంగాణ వాళ్లు మాత్రమే అతడి షోను ఎంజాయ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆంధ్రా వాళ్లు కూడా అతడి ఫ్యాన్స్ అయిపోయారు. రోజు రోజుకూ తన పాపులారిటీ పెంచుకుంటూ బుల్లితెరపై దూసుకెళ్లిపోతున్నాడు సత్తి. టీవీలోనే కాదు.. యూట్యూబ్ లోనూ అతడి షోకు తిరుగులేని ఆదరణ ఉంది. అతడి పాపులారిటీని ఇప్పుడు సినిమా వాళ్లు కూడా వాడేసుకుంటున్నారు.

టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘విన్నర్’ బిత్తిరి సత్తి ఒక క్యామియో చేశాడు. కనిపించేది ఐదు నిమిషాలే కానీ.. ఆ ఐదు నిమిషాల్లోనే తనదైన శైలిలో పంచ్ లు కురిపించి భలేగా నవ్వించాడు సత్తి. అతను కనిపించినపుడు థియేటర్లలో వస్తున్న స్పందనను బట్టే అతడి పాపులారిటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెస్పాన్స్ చూసి సత్తికి మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయి. సునీల్-ఎన్ కౌంటర్ శంకర్ దర్శకత్వంలో రానున్న ‘టు కంట్రీస్’ రీమేక్ లోనూ అతను నటిస్తున్నాడు. అలాగే జయంత్ సి.పరాన్జీ డైరెక్షన్లో గంటా రవితేజ కథానాయకుడిగా రానున్న సినిమాలోనూ కనిపించనున్నాడు. నిజానికి సత్తి ముందుగా సినిమాల్లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. కానీ అవకాశాలు రాకపోవడంతో టీవీ వైపు వెళ్లాడు. దాని ద్వారా వచ్చిన పాపులారిటీతో ఇప్పుడు సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. మున్ముందు అతను మరింత బిజీ అయ్యేలా కనిపిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/