Begin typing your search above and press return to search.

'మహానటి'ని ఆవిష్కరించిన జాతిరత్నానికి బర్త్ డే విషెస్..!

By:  Tupaki Desk   |   23 April 2021 11:30 AM GMT
మహానటిని ఆవిష్కరించిన జాతిరత్నానికి బర్త్ డే విషెస్..!
X
వైజయంతీ మూవీస్ అశ్వినీదత్ అల్లుడిగా నిర్మాత ప్రియాంక దత్ భర్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. తక్కువ సినిమాలే చేసినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫస్ట్ సినిమా 'ఎవడే సుబ్రహ్మణ్యం' తోనే అందరి దృష్టిని ఆకర్షించిన నాగ అశ్విన్.. రెండో సినిమా 'మహానటి' తో దేశ వ్యాప్తంగా తన గురించి మాట్లాడుకునేలా చేసాడు. అలనాటి నటి సావిత్రి బయోపిక్ గా ‘మహానటి’ని అద్భుతంగా ఆవిష్కరించాడు. కేవ‌లం ఒక్క సినిమాను మాత్ర‌మే డైరెక్ట్ చేసిన అనుభవం ఉన్న ద‌ర్శ‌కుడు సావిత్రి బయోపిక్ ఎలా తీయగలడని సందేహించిన వారందరూ ముక్కు మీద వేలేసుకునేలా చేశాడు.

రెండో సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన నాగ్ అశ్విన్.. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. పాన్ ఇంటర్నేషల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌ - దీపికా ప‌దుకొనె వంటి పాన్ ఇండియా స్టార్స్‌ ని నాగ్ అశ్విన్ డీల్ చేయనున్నాడు. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడానికి ట్రై చేస్తున్న యువ దర్శకుడు.. ప్రస్తుతం ప్రభాస్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ఇక 'జాతిరత్నాలు' సినిమాతో నిర్మాత అవతారమెత్తిన నాగ్ అశ్విన్.. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తో బాక్సాఫీస్ వద్ద మాంచి వసూళ్ళు అందుకున్నాడు. దీంతో మొదటి సినిమాతోనే ఈ అసలైన జాతిరత్నం నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

టాలీవుడ్ లో కొన్ని సినిమాలతోనే ద‌ర్శ‌కుడిగా నిర్మాతగా త‌న‌దైన మార్క్‌ క్రియేట్ చేసిన నాగ్ అశ్విన్.. నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. నాగ్ అశ్విన్ మామ, సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ ట్వీట్ చేస్తూ ''నీ కలల చిత్రసౌథాన్ని అద్భుతంగా రూపొందించాలనే నీ నిరంతర ప్రయత్నాన్ని కళామతల్లి నిండుగా దీవించాలని, కలకాలం నువ్వు ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటున్నాను'' అంటూ ఆయనకు బ‌ర్త్ డే విషెష్ తెలిపారు. అలానే స్వప్న దత్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నాగ్ అశ్విన్ ఎలాంటి వాడో చెప్పడానికి 'ఎవడే సుబ్రహ్మణ్యం' సమయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ని గుర్తు చేసింది. నాగ్ అశ్విన్ ఇలానే వేటికవే ప్రత్యేకమైన మరిన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటూ 'తుపాకీ డాట్ కామ్' ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.