Begin typing your search above and press return to search.

బర్త్ డే స్పెషల్: స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన మాస్ మహారాజా..!

By:  Tupaki Desk   |   26 Jan 2021 9:30 AM GMT
బర్త్ డే స్పెషల్: స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన మాస్ మహారాజా..!
X
సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో రవితేజ ఒకరు. తన సహజమైన నటన.. డైలాగ్ డెలివరీ.. తిరుగులేని ఎనర్జీ.. వంటివి అతన్ని స్టార్ హీరోల్లో ఒకడిగా నిలిపాయి. కెరీర్ ఆరంభంలో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసిన రవితేజ.. అంచెలంచెలుగా ఎదిగి 'మాస్ మాహారాజా'గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించిన రవితేజ.. రాజగోపాల్ - రాజ్యలక్ష్మి దంపతుల ముగ్గురు సంతానంలో పెద్దవాడు. రవితేజ భార్య పేరు కల్యాణి. వీరికి మోక్షద అనే కూతురు.. మహాధన్ అనే కుమారుడు ఉన్నారు. 1968 జనవరి 26న జన్మించిన రవితేజ నేడు 53వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన రవితేజ.. 1997లో 'సింధూరం' సినిమాలో సెకండ్ హీరోగా చేశాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘నీ కోసం’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' 'ఇడియట్' 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' 'నేనింతే' చిత్రాలు రవితేజను స్టార్ హీరోల సరసన నిలబెట్టాయి. అలానే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'విక్రమార్కుడు' చిత్రంలో రవితేజ తనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించాడు. ఈ క్రమంలో 'డాన్ శీను' 'మిరపకాయ్' 'బలుపు' 'పవర్' 'రాజా ది గ్రేట్' వంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు మాస్ మహారాజ్. అయితే ఆ తర్వాత వరుసగా ప్లాప్ లు రావడంతో రేస్ లో కాస్త వెనుకబడిపోయాడు. అయితే తాజాగా 'క్రాక్' మూవీతో సంక్రాంతి హీరోగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన రవితేజ.. మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. 2021లో తొలి హిట్ నమోదు చేసిన రవితేజ.. రెట్టింపు ఉత్సాహంతో ప్రస్తుతం 'ఖిలాడి' చిత్రంలో నటిస్తున్నాడు. స్వయంకృషితో హీరోగా సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన మాస్ మహారాజ్ రవితేజ.. మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలని కోరుకుంటూ 'తుపాకీ డాట్ కామ్' ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.