Begin typing your search above and press return to search.

బర్త్ డే స్పెషల్: అభిమానులు మెచ్చిన సూపర్ స్టార్ 'తలా

By:  Tupaki Desk   |   1 May 2021 9:54 AM GMT
బర్త్ డే స్పెషల్: అభిమానులు మెచ్చిన సూపర్ స్టార్ తలా
X
సౌత్ స్టార్ హీరో అజిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ తెలుగులో కూడా ఆయనకు ఫ్యాన్ బేస్ ఓ రేంజిలో ఉంది. అభిమానులు అజిత్ ను ప్రేమగా తలా అని పిలుచుకుంటారు. అయితే ఈరోజు ఈ స్టార్ హీరో 50వ పుట్టినరోజు కావడంతో సినీ ప్రేక్షకులు, సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అజిత్ ఎప్పుడు కూడా హంగులు ఆర్భాటాలకు పోకుండా చాలా సింపుల్ గా ఉండటానికే ఇష్టపడతారు. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఓసారి ఆయన సౌత్ ఇండియా స్టార్ ఎలా అయ్యారో ఓసారి చూద్దాం.

హీరో అజిత్ 1971 మే 1న సికింద్రాబాద్ లో జన్మించాడు. జన్మించింది ఇక్కడే అయినప్పటికీ హీరోగా ఎదిగింది మాత్రం తమిళంలోనే. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం (కేరళ), తల్లి సింధీ (బెంగాలీ). అందుకే అజిత్ ఇటు తెలుగు తమిళంతో పాటు కన్నడ మలయాళం, ఇంగ్లీష్ భాషలను చాలా బాగా మాట్లాడతారు. నిజానికి స్టార్ హీరో కదా.. ఏ రేంజిలో బడా డిగ్రీలు చదివి ఉంటాడు అనుకుంటారు. కానీ అజిత్ టెన్త్ అయిపోగానే చదువు ఆపేసి బైక్ మెకానిక్ గా పనిచేసాడు. ఆ సమయంలోనే సినిమాలపై మక్కువ ఏర్పడి మోడలింగ్ ప్రారంభించాడు.

ఇక మోడలింగ్ సమయంలో స్టార్ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ గమనించి అజిత్ ను సినిమాల్లోకి రెఫెర్ చేసాడట. ఆ విధంగా అజిత్.. 'ఎన్ వీడు ఎన్ కనవన్' అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ తో సినీ ప్రయాణం మొదలుపెట్టాడు. అజిత్ నటించిన ఒకే ఒక్క స్ట్రెయిట్ తెలుగు మూవీ 'ప్రేమపుస్తకం' కానీ ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. 1995లో అసాయ్ అనే సినిమాతో హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ప్రేమలేఖ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నాడు అజిత్. అప్పటినుండి అజిత్ సినిమాలు తెలుగులో డబ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్నో అవార్డులు అందుకున్న అజిత్.. 2000లో హీరోయిన్ షాలినిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

అజిత్ ఒకే ఏడాది ఆరు సూపర్ హిట్స్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ధీనా అనే మాస్ సినిమా చేసాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాలో అజిత్ పేరు తలా. అప్పటినుండి అభిమానులు తలా అనే పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం తలా అజిత్ వాలిమై అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. డైరెక్టర్ హెచ్. వినోద్ ఈ యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ స్పెషల్ డే సందర్బంగా తలా అజిత్ కు తుపాకీ మీడియా తరపున జన్మదిన శుభాకాంక్షలు!