Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : బింబిసార

By:  Tupaki Desk   |   5 Aug 2022 12:31 PM GMT
మూవీ రివ్యూ : బింబిసార
X
చిత్రం : బింబిసార

న‌టీన‌టులు: నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్-కేథ‌రిన్ త్రెసా- సంయుక్త మేన‌న్- శ్రీనివాస‌రెడ్డి-వరిన హుస్సేన్-వెన్నెల కిషోర్-బ్ర‌హ్మాజీ-అయ్య‌ప్ప పి.శ‌ర్మ‌ త‌దిత‌రులు
సంగీతం: చిరంత‌న్ భ‌ట్- కీర‌వాణి
నేప‌థ్య సంగీతం: కీర‌వాణి
ఛాయాగ్ర‌హ‌ణం: ఛోటా కే నాయుడు
మాట‌లు: వాసుదేవ్ మునెప్ప‌గారి
నిర్మాత: హ‌రికృష్ణ‌
క‌థ‌-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం: వ‌శిష్ఠ్

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సొంత బేన‌ర్లో కొత్త ద‌ర్శ‌కుల‌ను న‌మ్మి భారీ ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. బింబిసార కూడా ఆ కోవ‌లోనిదే. వ‌శిష్ఠ్ అనే కొత్త ద‌ర్శ‌కుడి మీద భ‌రోసాతో అత‌ను చేసిన ఈ ఫాంట‌సీ మూవీ ప్రేక్ష‌కుల దృష్టిని బాగానే ఆక‌ర్షించింది. ఈ రోజే థియేట‌ర్ల‌లోకి దిగిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకుందా.. క‌ళ్యాణ్ రామ్ ను తిరిగి స‌క్సెస్ ట్రాక్ ఎక్కించిందా.. చూద్దాం ప‌దండి.

కథ:

క్రీస్తు పూర్వం 500లో బింబిసారుడు (క‌ళ్యాణ్ రామ్) అనే మ‌హా క్రూరుడు.. అహంకారి అయిన రాజు త్రిగ‌ర్త‌ల సామ్రాజ్యాన్ని ప‌రిపాలిస్తుంటాడు. త‌న క‌న్ను ప‌డ్డ ప్ర‌తి రాజ్యాన్ని ఆక్ర‌మిస్తూ.. త‌న‌కు ఎదురొచ్చిన ప్ర‌తి వ్య‌క్తిని మ‌ట్టుబెడుతూ సాగిపోతుంటాడు. చివ‌రికి త‌న సొంత త‌మ్ముడైన దేవ‌ద‌త్తుడిని కూడా అధికారం కోసం చంపేయాల‌ని చూస్తాడు. అత‌డి నుంచి త‌ప్పించుకుని బ‌య‌ట ప‌డ్డ దేవ‌ద‌త్తుడు.. త‌న‌కు అనుకోకుండా దొరికిన మాయా అద్దం సాయంతో త‌న సోద‌రుడి అడ్డు తొల‌గించుకుని తండ్రి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా రాజ్యాన్ని ప్ర‌జల సంక్షేమం కోరి ప‌రిపాలించ‌డం మొద‌లుపెడ‌తాడు. మాయా అద్దం కార‌ణంగా ఆ కాలం నుంచి ప్ర‌యాణం సాగించి వ‌ర్త‌మానంలోకి వ‌చ్చి ప‌డ‌తాడు బింబిసారుడు. ఇక్క‌డ అత‌డికి ఎలాంటి అనుభ‌వాలు ఎదురయ్యాయి.. తిరిగి అత‌ను త‌న రాజ్యానికి వెళ్ల‌గ‌లిగాడా.. బింబిసారుడి సాయంతో ర‌హ‌స్య ప్రాంతంలో ఉన్న వైద్య గ్రంథం ధ‌న్వంత‌రిని ద‌క్కించుకోవ‌డానికి ఎదురు చూస్తున్న వారి ప్ర‌య‌త్నం ఫ‌లించిందా.. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెర మీదే తెలుసుకోవాలి.

క‌థ‌నం-విశ్లేష‌ణ:

అనుభ‌వం లేని ద‌ర్శ‌కుడు.. మార్కెట్ దెబ్బ తిన్న హీరో.. చారిత్రక నేప‌థ్యం.. ఫాంట‌సీ ట‌చ్ ఉన్న‌ టైమ్ ట్రావెల్ క‌థ అన‌గానే ప్రేక్ష‌కులు కొంచెం కంగారు ప‌డ‌తారు. ఇలాంటి క‌థ‌ల‌ను స్టార్ హీరోలు.. పెద్ద ద‌ర్శ‌కులే డీల్ చేయ‌లేక ప‌క్క‌న పెట్టేసిన ప‌రిస్థితి. బాహుబ‌లితో రాజ‌మౌళి ఎంత ధైర్యాన్నిచ్చినా.. ఇలాంటి క‌థ‌ల‌ను వేరే వాళ్లు ప‌క‌డ్బందీగా తెర‌కెక్కిస్తార‌న్న ఆశ‌లు ప్రేక్ష‌కుల్లో పెద్ద‌గా లేవు. ఐతే వ‌శిష్ఠ అనే కొత్త ద‌ర్శ‌కుడి మీద భ‌రోసాతో.. ఫామ్ లో లేని నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ బింబిసార‌తో పెద్ద సాహ‌స‌మే చేశాడు. ట్రైల‌ర్లలో మెరుపులు చూసి ఇవి పైపై మెరుగులేమో అనుకుంటే.. ఆ అభిప్రాయాన్ని మారుస్తూ.. విష‌యం ఉన్న క‌థ‌ను ఆస‌క్తిక‌ర క‌థ‌నంతో చాలా వ‌ర‌కు ఎంగేజింగ్ గానే బింబిసార‌ను తీర్చిదిద్దింది చిత్ర బృందం. బాహుబ‌లి లాంటి సినిమాల‌తో పోల్చేంత‌.. వావ్ అనుకునేంత అద్భుతంగా లేదు కానీ.. ఆద్యంతం ప్రేక్ష‌కుల ఆస‌క్తిని నిలిపి ఉంచ‌డంలో.. సంతప్తిక‌రంగా థియేట‌ర్ల నుంచి బ‌య‌టికి అడుగు పెట్టేలా చేయ‌డంలో బింబిసార విజ‌య‌వంతం అయింది.

టైం ట్రావెల్ ఫ్రం బ్యాడ్ టు గుడ్.. బింబిసార ట్యాగ్ లైన్ ఇది. ఈ క‌థ సార‌మంతా ఈ లైన్లోనే ఉంది. అధికార దాహంతో.. అహంకారంతో మిడిసిప‌డే ఒక రాజు కాలంలో ప్ర‌యాణించి వ‌ర్త‌మానంలోకి రావ‌డం.. ఇక్క‌డ మంచి మ‌నిషిగా మారి త‌న జీవితానికి ఒక ప‌ర‌మార్థం ఉండేలా మంచి చేసి త‌న క‌థ‌కు ముగింపు ఇవ్వ‌డం.. ఇదీ సింపుల్ గా బింబిసార సారాంశం. ఐతే కాగితం మీద సింపుల్ గా క‌నిపించే ఈ కాన్సెప్ట్ ను తెర‌పై రెండున్న‌ర గంట‌ల సినిమాగా ప్రెజెంట్ చేయ‌డం అంత తేలిక కాదు. కొత్త ద‌ర్శ‌కుడు అయిన‌ప్ప‌టికీ వ‌శిష్ఠ ఈ ప‌నిని విజ‌యంతంగా చేయ‌గ‌లిగాడు.

మామూలుగా ఇలాంటి క‌థ‌ల‌ను వ‌ర్త‌మానంతో మొద‌లుపెట్టి.. క‌థ ర‌స‌కందాయంలో ప‌డ్డాక‌ మ‌ధ్యలో గ‌తంలోకి తీసుకెళ్లి.. తిరిగి చివ‌ర్లో వ‌ర్త‌మానంలోకి తీసుకొస్తుంటారు. రాజ‌మౌళి సైతం మ‌గ‌ధీర‌.. బాహుబ‌లి సినిమాల్లో ఈ ఫార్ములానే అనుస‌రించాడు. నిజానికి ఇది సేఫ్ గేమ్ లాంటిది. ప్రేక్ష‌కులు ఫ్లాష్ బ్యాక్ కోసం ఎదురు చూసేలా చేసి మ‌ధ్య‌లో అక్క‌డికి తీసుకెళ్లి హై ఇవ్వ‌డానికి స్కోప్ ఉంటుంది. కానీ వ‌శిష్ఠ మాత్రం దానికి భిన్న‌మైన స్క్రీన్ ప్లేను అనుస‌రించాడు. నేరుగా గ‌తం నుంచే క‌థ‌ను మొద‌లుపెట్టేశాడు. ఈ క‌థ‌కు ఆక‌ర్ష‌ణ అయిన బింబిసార‌ను ఆరంభంలోనే ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశాడు. ట్విస్టులేమీ లేకుండా అత్యంత క్రూరుడిగా బింబిసార పాత్ర‌ను ప్రెజెంట్ చేశాడు. ఆరంభంలో కొంచెం మామూలుగా అనిపించినా.. ఈ క‌థ‌లో మ‌లుపు చోటు చేసుకునే ద‌గ్గ‌ర ఎమోష‌న్లు బాగా పండ‌డం.. సాగ‌దీయ‌కుండా త్వ‌ర‌గా ఈ క‌థకు బ్రేక్ ఇచ్చి వ‌ర్త‌మానంలోకి తీసుకురావ‌డంతో ప్రేక్ష‌కుల‌కు భిన్న‌మైన అనుభూతి క‌లుగుతుంది.

య‌మ‌లీల లాంటి సినిమాల‌ను గుర్తుకు తెస్తూ.. ఒక రాజు ఇప్ప‌టి కాలంలోకి అడుగు పెడితే జ‌నాలు అత‌ణ్ని ఎలా చూస్తారు.. ఇక్క‌డి ప‌రిస్థితుల‌కు అత‌నెలా స్పందిస్తాడు అన్న‌ది వినోదాత్మ‌కంగా చూపిస్తూ క‌థ‌నాన్ని ముందుకు న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా సాగినా.. ఇది ఫాంట‌సీ క‌థ కావ‌డంతో పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ ద‌గ్గ‌ర ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసి ద్వితీయార్ధం మీద బాగానే ఆస‌క్తి రేకెత్తించ‌గ‌లిగారు. ఐతే సెకండాఫ్ అనుకున్నంత ఎగ్జైటింగ్ గా అయితే లేదు. చాలా వ‌ర‌కు సీన్లు సాధార‌ణంగా సాగిపోతాయి. పాట‌లు అన‌వ‌స‌రం అనిపిస్తాయి. ప‌తాక స‌న్నివేశాల‌కు ముందు వ‌ర‌కు క‌థ‌నం ఒడుదొడుకుల‌తో సాగుతుంది. ఐతే గ‌తానికి.. వ‌ర్త‌మానానికి ముడిపెడుతూ కొంచెం లెంగ్తీగా సాగే ప‌తాక స‌న్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. ఈ క‌థ‌ ఎలా ముగుస్తుంది అనే విష‌యంలో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేకెత్తించి.. వారిని మెప్పించేలా ఆఖ‌రి స‌న్నివేశాలు సాగుతాయి. ద‌ర్శ‌కుడు ఒక కాన్సెప్ట్ అనుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఆక‌ట్టుకుంటుంది. కాక‌పోతే ఇలాంటి నేప‌థ్యం ఉన్న సినిమాల్లో ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయే స‌న్నివేశాలు.. ఎమోష‌న‌ల్ గా.. ఎలివేష‌న్ల ప‌రంగా హై ఇచ్చే ఎపిసోడ్లు ఆశిస్తారు. అవి అనుకున్నంత స్థాయిలో సినిమాలో లేవు. కానీ ప్రేక్ష‌కులకు ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా ఉన్నంత‌లో ఆస‌క్తిక‌ర క‌థ‌నంతో ఎంగేజ్ చేయ‌డంలో బింబిసార స‌క్సెస్ అయింది.

న‌టీన‌టులు:

బింబిసారుడి పాత్ర కోసం నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్రాణం పెట్టేశాడు అంటే పెద్ద మాట కాదు. అత‌ను ఎంతో ఓన్ చేసుకుని శ్ర‌ద్ధ‌తో ఈ పాత్ర చేసిన విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఆహార్యం ప‌రంగా ఉన్న ప‌రిమితుల వ‌ల్ల‌ రాజు పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ కు అల‌వాటు ప‌డ‌డానికి ప్రేక్ష‌కుల‌కు కొంత స‌మ‌యం ప‌ట్టొచ్చు. కానీ త‌న మంద స్వ‌రం.. అలాగే హావ‌భావాల‌తో బింబిసార‌లో నెగెటివ్ షేడ్స్ ను అత‌ను తెర‌మీద బాగా చూపించ‌గ‌లిగాడు. ఆ పాత్ర‌కు తాను స‌రిపోయాను అనిపించ‌గ‌లిగాడు. త‌న శ‌రీరాకృతిని మార్చుకుని అత‌ను ప‌డ్డ క‌ష్ట‌మంతా తెర‌పై క‌నిపిస్తుంది. పెర్ఫామెన్స్ ప‌రంగా క‌ళ్యాణ్ రామ్ కు ఈ చిత్రం కెరీర్ బెస్ట్ అన‌డంలో సందేహం లేదు. ఒక ర‌కంగా చెప్పాలంటే సినిమాలో అత‌డిది వ‌న్ మ్యాన్ షో. హీరోయిన్ల‌లో కేథ‌రిన్ థ్రెసా క‌నిపించిన త‌క్కువ స‌న్నివేశాల్లోనే ఆక‌ట్టుకుంది. సంయుక్త మేన‌న్ మాత్రం తేలిపోయింది. ఆమె పాత్ర నామ‌మాత్రం. త‌న లుక్స్ కూడా ఏమంత బాగా లేవు. విల‌న్ పాత్ర‌లో క‌నిపించిన వరిన హుస్సేన్ ఓకే అనిపించాడు. ఆ స్థానంలో కాస్త పేరున్న న‌టుడిని పెడితే విల‌న్ పాత్ర ఎలివేట్ అయ్యేదేమో అనిపిస్తుంది. అయ్య‌ప్ప పి.శ‌ర్మ త‌న‌కు అల‌వాటైన మాంత్రికుడి త‌ర‌హా పాత్ర‌లో మెప్పించాడు. ప్ర‌కాష్ రాజ్ పాత్ర‌.. న‌ట‌న మామూలుగా అనిపిస్తాయి. జుబేదా క్యారెక్ట‌ర్లో శ్రీనివాస‌రెడ్డి మెప్పించాడు.. న‌వ్వించాడు. బ్ర‌హ్మాజీ.. వైవా హ‌ర్ష‌.. చ‌మ్మ‌క్ చంద్ర‌.. వీళ్లంతా మామూలే.


సాంకేతిక వ‌ర్గం:

ఇలాంటి చిత్రాల‌కు నేప‌థ్య సంగీతం అందించడానికి కీర‌వాణి కంటే బెట‌ర్ ఛాయిస్ మ‌రొక‌రు క‌నిపించ‌రు. ఆయ‌న త‌న‌దైన శైలిలో నేప‌థ్య సంగీతం అందించి సినిమాను ఎలివేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. కాక‌పోతే ఆర్ఆర్ లో ఎక్కువ‌గా బాహుబ‌లి అనుక‌ర‌ణ క‌నిపిస్తుంది. అయినా స‌రే.. స‌న్నివేశాల‌ను ఎలివేట్ చేయ‌డంలో నేప‌థ్య సంగీతం ముఖ్య పాత్ర పోషించింది. కీర‌వాణి.. చిరంత‌న్ భ‌ట్ క‌లిసి అందించిన పాట‌లు బాగానే సాగాయి. కానీ సినిమాలో చాలా వ‌ర‌కు పాట‌లు స్పీడ్ బ్రేక‌ర్ల‌లా అనిపిస్తాయి. ఛోటా కే నాయుడు చాన్నాళ్ల త‌ర్వాత త‌న కెమెరా ప‌నిత‌నాన్ని చాటాడు. మ‌రీ బాహుబ‌లి త‌ర‌హా ఔట్ పుట్ ఆశించ‌లేం కానీ.. ఉన్న ప‌రిమితుల్లో తెర‌పై భారీత‌నాన్ని ఆవిష్క‌రించాడు. ప్రొడ‌క్ష‌న్ డిజైన్.. విజువ‌ల్ ఎఫెక్ట్స్ టీం క‌ష్టం తెర‌పై కనిపిస్తుంది. త‌క్కువ ఖ‌ర్చుతోనే మంచి ఔట్ పుట్ ఇచ్చారు. వాసుదేవ్ మునెప్ప‌గారి సంభాష‌ణ‌లు బాగున్నాయి. ఇక క‌థా ర‌చ‌యిత‌.. ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ తొలి చిత్రంతో మంచి ప‌నిత‌నం చూపించాడు. అత‌డి బ‌లం స్క్రిప్టులోనే ఉంది. పైపై మెరుగుల‌తో స‌రిపెట్ట‌కుండా అత‌ను ఒక కాన్సెప్ట్ తో క‌థ‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. స్క్రీన్ ప్లే కూడా కొంచెం భిన్నంగానే చేసుకున్నాడు. స‌న్నివేశాల‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా రాసుకుని ఉంటే.. ద్వితీయార్ధాన్ని ఇంకొంచెం మెరుగ్గా తీర్చిదిద్దుకుని ఉంటే బింబిసార మ‌రో స్థాయికి వెళ్లేది. అయినా స‌రే.. తొలి చిత్రంలో వ‌శిష్ఠ చూపించిన ప్ర‌తిభ అభినంద‌నీయం.

చివ‌ర‌గా: బింబిసారుడు మెప్పించాడు

రేటింగ్-2.75/5