Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్ తెలుగు-6' ప్రోమో: ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్..!

By:  Tupaki Desk   |   9 Aug 2022 6:22 AM GMT
బిగ్ బాస్ తెలుగు-6 ప్రోమో: ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్..!
X
తెలుగు బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన రియాలిటీ షో 'బిగ్ బాస్'. వివాదాలు చెలరేగినా.. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ కార్యక్రమానికి ప్రేక్షకాదరణ దక్కుతూనే ఉంది. ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు 6వ సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈసారి కూడా కింగ్ అక్కినేని నాగార్జున ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

'బిగ్ బాస్ తెలుగు 6' షో 'స్టార్ మా' మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో త్వరలోనే ప్రసారం కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నిర్వాహకులు లేటెస్ట్ సీజన్ కు సంబంధించిన ప్రోమోని రెడీ చేశారు. తాజాగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఈ ప్రోమోని విడుదల చేశారు.

ఓ నవవధువు అప్పగింతల సమయంలో తండ్రిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఒకరినొకరు ఓదార్చుకుంటుండగా.. పక్కనే ఉన్న తల్లి మైబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది. పెళ్లి కూతురు కళ్ళు తుడుచుకుని చూసే సరికి పెళ్లి కొడుకు - తల్లీదండ్రులతో సహా అక్కడ అందరూ అదృశ్యమవుతారు. అందరూ ఏమైపోయారని ఆ అమ్మాయి వెతుకుతుండగా.. 'మై డియర్' అంటూ నాగ్ ఎంట్రీ ఇచ్చారు.

బ్యాగ్రౌండ్ లో 'బిగ్ బాస్' థీమ్ మ్యూజిక్ వినిపిస్తుండగా.. అందరూ టీవీ ముందు కళ్ళప్పగించి చూస్తూ కనిపించారు. ''అప్పగింతల వరకూ ఆగలేకపోతున్నారంటే.. అక్కడ ఆట మొదలైనట్లే.. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే.. బిగ్ బాస్ సీజన్-6.. ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్'' అని నాగ్ తనదైన శైలిలో చెప్పడంతో ఈ ప్రోమో ముగుస్తుంది.

అప్పగింతలతో ముడిపెడుతూ డిజైన్ చేసిన 'బిగ్ బాస్ తెలుగు - 6' ప్రోమో కామెడీగా ఆసక్తికరంగా సాగింది. నాగార్జున ట్రెడిషనల్ దుస్తుల్లో మరియు షూట్ లో కనిపించిన ఆకట్టుకున్నారు. ''లైఫ్ లో ఏ క్షణం అయినా బిగ్ బాస్ తరువాతే! ఫుల్ ఫన్ అండ్ ఎమోషన్స్ తో మరో వినోదాత్మక సీజన్‌ తో తిరిగి వస్తున్నాం. స్టార్‌ మా మరియు డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్ లో #BiggBossTelugu6 రాబోతోంది'' అని నాగ్ ట్వీట్ చేశారు

ఇప్పటి వరకు వచ్చిన ఐదు సీజన్లలో వరుసపెట్టి మూడు సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. హౌస్ లో నాగ్ కంటెస్టెంట్ లను డీల్ చేసే విధానం.. వారితో వ్యవహరించే తీరు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే వీకెండ్ లో మంచి టీఆర్పీలు నమోదవుతుంటాయి.

ఇక ఓటీటీ నాన్ స్టాప్ బిగ్ బాస్ కు కూడా నాగార్జున హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు సరికొత్త సీజన్ తో వినోదం పంచడానికి రెడీ అయ్యారు నాగ్. సెప్టెంబర్ రెండో వారం నుండి 'బిగ్ బాస్ తెలుగు-6 ప్రారంభం కానుందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. అలానే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ వివరాలు కూడా వెల్లడికానున్నాయి.