Begin typing your search above and press return to search.

అరే.. వచ్చి వారం కాలేదు.. అప్పుడే పంపేయమంటున్నాడే

By:  Tupaki Desk   |   9 Sep 2022 4:47 AM GMT
అరే.. వచ్చి వారం కాలేదు.. అప్పుడే పంపేయమంటున్నాడే
X
బిగ్ బాస్ హౌస్ అప్పుడే వేడెక్కిపోయింది. హౌస్ లోకి వచ్చి సరిగ్గా వారం కూడా కాలేదు. నాలుగు రోజులకే.. హౌస్ నుంచి ఈ క్షణమే పంపేయండి.. వెళ్లిపోతానంటూ ఒక కంటెస్టెంట్ వాపోయిన వైనం చూస్తే.. ఇదెక్కడి గోలరా అనుకోకుండా ఉండలేరు. ఫన్.. ఫస్ట్రేషన్.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకొనే బిగ్ బాస్ హౌస్ లో ఉండాలా? అన్నట్లుగా కొందరి తీరు ఉంటే.. మరికొందరు సేఫ్ ఆడేస్తున్న వైనం బిగ్ బాస్ సీజన్ 6 లోని నాలుగోరోజు ఎపిసోడ్ లో కనిపించింది. ఎప్పటి మాదిరే చిన్న చిన్న ఇష్యూలకు చెలరేగిపోవటం.. నోటికి వచ్చినట్లుగా అనుకోవటం.. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవటం లాంటి రోటీన్ ఘటనలు తాజా ఎపిసోడ్ లోనూ చోటు చేసుకుంది.

భార్యభర్తలైన మెరీనా.. రోహిత్ లు ఎప్పటిలానే గొడవపడటం.. రోహిత్ తనతో కాసేపు వాకింగ్ చేయమంటే పట్టించుకోకుండా శ్రీసత్యతో వెళ్లిపోయాడంటూ పనికిరాని పంచాయితీని పెట్టింది మెరీనా. నా భర్తతో నేను వాకింగ్ చేయొద్దా? అంటూ రాద్ధాంతం చేసినా అది వర్కువుట్ కాలేదు. ఎందుకంటే.. అమ్మడు చేసేది ఫ్రాంక్ అన్న విషయాన్ని ఇంటి సభ్యులు గుర్తిస్తే.. టార్గెట్ అయిన శ్రీసత్య మాత్రం ఆ విషయాన్ని గుర్తించకుండా ఎమోషనల్ అయి ఏడ్చేసింది.దీంతో.. ఇదంతా ఉత్తుత్తినే.. జస్ట్ ఫ్రాంక్ అంటూ శ్రీసత్య చేసిన కామెడీ నవ్వు రాకపోగా.. వెగటు పంచాయితీగా మారింది.

ఆ తర్వాతి రచ్చకు బిగ్ బాస్ ఆడించిన ఒక గేమ్ కారణమైంది. ఇంటి సభ్యుల్ని రెండు జట్లుగా విడిపోవాలని చెప్పారు. చివర్లో ఆరోహి.. రేవంత్ లు బీ టీంలో ఆడేందుకు ఈ ఇద్దరు పోటీ పడ్డారు. చివరకు అవకాశం ఆరోహికి దక్కింది. ఈ గేమ్ లో బీ టీం గెలవటంతో వారికో స్పెషల్ గిఫ్టు అందుకున్నారు. ఏ టీం సభ్యుడైన రేవంత్ దీంతో నిరాశకు గురయ్యాడు. రెండుసార్లు తాను బీ టీంలోకి వెళతానంటే ఆరోహి వెళ్లిందని.. గేమ్ ఓడిపోయినందుకు రుసరుసలాడాడు.

అతడి మాటలకు హర్ట్ అయిన ఆరోహి.. తనతో మాట్లాడొద్దంటూ వేలు (తప్పుడు) చూపించి పౌరుషంతో వెళ్లి.. ఏడ్చేసింది. ఇదెక్కడి గోల? ఇప్పుడేమన్నానని ఇంత సీన్ అనుకున్న రేవంత్ కెమేరా ముందుకువెళ్లి.. తన వల్ల సమస్య అనుకుంటే తనను పంపేయాలని చెప్పుకున్నారు.

నటిస్తూ ఒకర్ని సంతోష పెట్టటం కోసం తన క్యారెక్టర్ ను చంపుకోలేనని.. ఇక్కడంతా చాలామంది గ్రూప్ గా ఆడుతున్నారని.. తాను మాత్రం సింగిల్ గానే ఆడతానని.. ఎన్నిరోజులైనా ఆడతానంటూ చెప్పుకోవటం గమనార్హం.

అదే సమయంలో ఇంత సిన్సియర్ పీపుల్ మధ్య తాను అర్హుడ్ని కాదేమోని.. ఈ నిమిషమే నన్ను పంపేయాలని.. తనకు యాక్టింగ్ చేస్తూ బతకటం రాదంటూ రచ్చ రచ్చ చేశాడు. బిగ్ బాస్ హౌస్ అంటేనే ఎమోషనల్ గేమ్. ఎవరెంత భావోద్వేగానికి గురైనా.. ఇంటి నుంచి పంపేయండి.. ఇంటి నుంచి వెళ్లిపోతానన్న మాటే రాకూదు. అదే పెద్ద మైనస్. హౌస్ లోకి వచ్చి వారం కూడా కాలేదు.. అప్పుడే పంపేయాలంటూ రేవంత్ చేసిన రచ్చ చూస్తే.. హౌస్ ను అతగాడు సరిగా అర్థం చేసుకోకుండా వచ్చాడా? అన్న సందేహం కలుగక మానదు. తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవాలే కానీ.. ఇలా ఫస్ట్రేషన్ ప్రదర్శించి.. తనను పంపేయమని కోరటం అతగాడికి మైనస్ అవుతుందన్న విషయాన్ని అతడెందుకు మిస్ అవుతున్నట్లు?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.