Begin typing your search above and press return to search.

చిన్న సినిమాల నిర్మాతలు.. పెద్ద కష్టాలు!

By:  Tupaki Desk   |   17 March 2020 4:00 PM IST
చిన్న సినిమాల నిర్మాతలు.. పెద్ద కష్టాలు!
X
అన్నీ సీజన్లు పెద్ద సినిమాలకే ఫిక్స్ అయిపోతాయి. సంక్రాంతి.. వేసవి.. దసరా.. క్రిస్మస్ ఇలా హాలిడే సీజన్లతో పాటుగా రెండు రోజులు శెలవులు కలిసి వచ్చే ఎటువంటి వీకెండ్ ను కూడా పెద్ద సినిమాల నిర్మాతలు వదలరు. ఇలాంటి సందర్భాల్లో చిన్న సినిమాలను రిలీజ్ చేసే అవకాశం దొరకదు. థియేటర్ల సమస్య వస్తుంది కాబట్టి చిన్న సినిమాలను దాదాపుగా అన్ సీజన్ లోనే.. పెద్ద సినిమాలు లేని సమయంలోనే రిలీజ్ చేసుకోవాలి.

అలాంటి అన్ సీజన్లలో మార్చ్ నెల ఒకటి. పరిక్షల సీజన్ కావడం తో దాదాపుగా అధికశాతం ప్రేక్షకులు థియేటర్లకు దూరంగా ఉంటారు. బాగుందని టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉండవు. అయితే చిన్న సినిమాల మేకర్స్ కు తప్పదు కాబట్టి రిలీజులు ప్లాన్ చేసుకుంటారు. దీని వెనక వారి స్వార్థం ఏంటంటే ఏదో కొన్ని థియేటర్లలో విడుదల చేసి జస్ట్ విడుదల అయిందని అనిపించుకుంటే చాలు. సినిమాకు కొంతమేరకు పాజిటివ్ రేటింగ్స్ తెచ్చుకుంటే డిజిటల్.. శాటిలైట్ రైట్స్ అయినా వస్తాయి. దీంతో సదరు నిర్మాతలు పెట్టిన పెట్టుబడి వెనక్కు వస్తుంది. అదృష్టం కూడా కలిసి వస్తే నాలుగు రాళ్ళు కూడా వెనకేసుకోవచ్చు.

అయితే ఈ మార్చ్ లో కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడడం ఇలాంటి చిన్న సినిమాల నిర్మాతలకు పెద్ద ఇబ్బందిగా మారింది. మార్చ్ 31 తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. థియేటర్ల మూసివేతతో ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. దీని వల్ల వచ్చిన చిక్కేంటంటే మరో రెండు మూడు నెలల పాటు రిలీజ్ చేసేందుకు అనుకూలమైన డేట్ దొరకదు. ఏదేమైనా ఈ కరోనా దెబ్బకు చిన్న సినిమాల నిర్మాతలకు మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయింది.