Begin typing your search above and press return to search.

‘బాహుబలి’ కన్నా ‘బిచ్చగాడు’ గొప్ప..

By:  Tupaki Desk   |   2 July 2016 5:30 AM GMT
‘బాహుబలి’ కన్నా ‘బిచ్చగాడు’ గొప్ప..
X
ఓ మోస్తరు సినిమాలైనా సరే.. ఇప్పుడు వందల థియేటర్లలో రిలీజైపోతున్నాయి. కానీ తొలి వారాంతం అవ్వగానే ఆ థియేటర్లు నిలవవు. సినిమా బాలేకుంటే రెండో వారానికల్లా థియేటర్లలోంచి సినిమా వెళ్లిపోతుంది. హిట్టు అనిపించుకున్నా సరే.. క్రమంగా థియేటర్లు తగ్గుతాయి తప్ప పెరగవు. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా మూణ్నాలుగు వారాల తర్వాత అడ్రస్ గల్లంతయిపోతుంది. కానీ ‘బిచ్చగాడు’ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. రోజు రోజుకూ థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ దూసుకెళ్లిపోతోందీ సినిమా. ఇటీవలే ‘బిచ్చగాడు’ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ సమయానికి ఈ చిత్రం 200 థియేటర్లలో ఆడుతుండటం విశేషం.

బాహుబలి.. శ్రీమంతుడు.. సోగ్గాడే చిన్నినాయనా.. ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ సెంటర్లలో 50 రోజులాడిన సినిమాలివి. ఐతే 50వ రోజు సమయానికి ఆ సినిమాల కంటే కూడా ‘బిచ్చగాడు’ ఎక్కువ థియేటర్లలో ఆడుతుండటం విశేషం. పైన చెప్పుకున్న మూడు సినిమాల 50 డేస్ సెంటర్లు వందకు అటు ఇటుగా ఉన్నాయి. దానికే చాలా గొప్పగా అనుకున్నారు. కానీ ‘బిచ్చగాడు’ విడుదలైన రెండో వారం నుంచి క్రమ క్రమంగా థియేటర్లు పెరిగి.. ఇప్పుడు 200కు పైగా సెంటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం 50 థియేటర్లలో మాత్రమే ఈ సినిమా రిలీజవడం విశేషం. 50 రోజుల తర్వాత కూడా ఈ సినిమా జోరేమీ తగ్గలేదు. కొన్ని సెంటర్లలో వంద రోజుల ప్రదర్శన కూడా పూర్తి చేసుకునేలా ఉందీ సినిమా.