Begin typing your search above and press return to search.

బిచ్చగాడి ప్రయాణంలో మరో మైలురాయి

By:  Tupaki Desk   |   17 July 2016 11:30 AM GMT
బిచ్చగాడి ప్రయాణంలో మరో మైలురాయి
X
బిచ్చగాడు అనే సినిమా విడుదలైనపుడు ఎవ్వరికీ పట్టలేదు. వారం తర్వాత కానీ జనాలకు ఈ సినిమా గురించి తెలియలేదు. ఇదేదో మంచి సినిమా అట అంటూ జనాలు మాట్లాడుకోవడంతో నెమ్మదిగా కలెక్షన్లు పెరిగాయి. రెండో వారం కలెక్షన్లు పుంజుకోవడం చూసి.. ఈ సినిమా కోటి రూపాయలకు పైగా వసూలు చేసేలా ఉందంటూ గొప్పగా చెప్పుకున్నారు. రెండో వారం పూర్తయ్యేసరికి ఆ మార్కు దాటేసింది. ఆ తర్వాత ఐదు కోట్ల టార్గెట్ అన్నారు. అదీ దాటేసింది. ఆపై రూ.10 కోట్లు.. తర్వాత రూ.15 కోట్లు.. రూ.20 కోట్లు.. ఇలా చూస్తుండగానే ఒక్కో మైలురాయినీ దాటుకుంటూ వెళ్లిపోయిందీ సినిమా.

రూ.20 కోట్ల మార్కును టచ్ చేసినపుడే వామ్మో అనుకున్నారు. అదే చాలా చాలా గొప్ప అనుకున్నారు. కానీ ఈ సినిమా ఏకంగా రూ.25 కోట్ల గ్రాస్ మార్కును కూడా టచ్ చేసేసింది. దీన్ని జస్ట్ బ్లాక్ బస్టర్ అని సరిపెట్టలేని పరిస్థితి. ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడికి.. సాధించిన వసూళ్లకు అసలు పొంతనే లేదు. అనువాదాల చరిత్రలోనే కాదు.. బహుశా తెలుగు సినిమా చరిత్రలోనే ఇది పెట్టుబడి మీద అత్యధిక రెట్లు వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా చెప్పొచ్చు. 63వ రోజుకు రూ.25 కోట్ల మైలురాయిని అందుకుంది ‘బిచ్చగాడు’. ఆంధ్రాలో రూ.10.87 కోట్లు.. నైజాంలో రూ.7.35 కోట్లు.. సీడెడ్ లో రూ.6.85 కోట్లు వసూలు చేసిందీ సినిమా. ఇప్పటికీ 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో బిచ్చగాడు థియేటర్లు నడుస్తున్నాయి. వంద రోజుల వరకు ‘బిచ్చగాడు’ హవా తగ్గేలా లేదు. రూ.30 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.