Begin typing your search above and press return to search.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ లో బిచ్చగాడి హవా

By:  Tupaki Desk   |   27 Jun 2016 9:50 AM GMT
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ లో బిచ్చగాడి హవా
X
మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాను విడుదలైన రెండు మూడు రోజులకే థియేటర్ల నుంచి తీసేసి పెద్దగా పేరు లేని తమిళ డబ్బింగ్ సినిమాను రీప్లేస్ చేయడం అన్నది ఊహకందని విషయం. గత నెల ఇదే జరిగింది. ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్ వీకెండ్ అవ్వగానే అది ఆడుతున్న థియేటర్లలో ‘బిచ్చగాడు’ను రీప్లేస్ చేశారు. ఆ తర్వాత కూడా చాలా తెలుగు సినిమాలకు చెక్ పెట్టింది విజయ్ ఆంటోనీ సినిమా. ఆరేడు వారాల తర్వాత కూడా ఈ సినిమా హవా తగ్గకపోవడం.. కొత్త తెలుగు సినిమాల స్థానంలో దీన్ని రీప్లేస్ చేస్తూనే ఉండటం.. అంతకంతకూ థియేటర్లు పెరుగుతుండటం.. కలెక్షన్లు కూడా స్టడీగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం.

గత శుక్రవారం రోజు తెలుగులో ‘ఒక మనసు’తో పాటు ‘కుందనపు బొమ్మ’ అనే ఇంకో సినిమా కూడా రిలీజైంది. అదే రోజు శర్వానంద్ సినిమా ‘రాజాధిరాజా’ కూడా విడుదలవ్వాల్సింది. కానీ అది రిలీజవ్వలేదు. దీంతో దానికి కేటాయించిన థియేటర్లలో మెజారిటీ ‘బిచ్చగాడు’కు వెళ్లిపోయాయి. ‘కుందనపు బొమ్మ’ రిలీజైందే తక్కువ థియేటర్లలో అంటే.. రెండో రోజు నుంచి వాటిని కూడా ‘బిచ్చగాడు’తో రీప్లేస్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ లో అన్నింటికంటే పెద్ద థియేటర్ అయిన సంధ్య 70 ఎంఎంలో శుక్రవారం ‘కుందనపు బొమ్మ’ రిలీజైంది. సాయంత్రానికే థియేటర్ వెలవెలబోవడంతో మరుసటి రోజు నుంచి ‘బిచ్చగాడు’ సినిమాను ఆడించారు. వీకెండ్లో అక్కడ ఈ సినిమా అనూహ్యమైన కలెక్షన్లు సాధించింది.

ఆదివారం సాయంత్రం ఫస్ట్ షోకైతే.. ఏకంగా 72 వేలు వసూలు చేసి సంచలనం సృష్టించిందీ సినిమా. ఈ శుక్రవారం విడుదలైన ‘ఒక మనసు’తో పాటు అంతకుముందు హిట్ టాక్ తెచ్చుకున్న జెంటిల్ మన్.. అఆ సినిమాలకు కూడా ఆదివారం ఫస్ట్ షోకు క్రాస్ రోడ్స్ లో ఈ స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఆ రెండు సినిమాలు ఫుల్ అయినా ఇంతకంటే తక్కువ వసూళ్లే రాబట్టాయి. 50 రోజులకు చేరువవుతున్న ఓ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అద్భుతమైన విషయం కదా.