Begin typing your search above and press return to search.

నటిగా 20యేళ్లు పూర్తిచేసుకున్న మోడ్రెన్ మిస్సమ్మ!

By:  Tupaki Desk   |   20 May 2020 2:30 AM GMT
నటిగా 20యేళ్లు పూర్తిచేసుకున్న మోడ్రెన్ మిస్సమ్మ!
X
భూమిక చావ్లా. తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ 2000లో విడుదలైన 'యువకుడు' సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించింది. తర్వాత ముంబైలో సెటిల్ అయినా హీరోయిన్ గా సెటిల్ అయింది మాత్రం తెలుగులోనే. అలా హీరోయిన్ గా ఇండియాలోని అన్నీ ఇండస్ట్రీలలో పనిచేసింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, భోజ్ పురి, పంజాబీ, మలయాళ భాషలలో అనేక చిత్రాలలో నటించింది. ఆమె కెరీర్ లో ఖుషి, తేరే నామ్, మిస్సమ్మ, గాంధీ, మై ఫాదర్ మరియు సత్యభామ చిత్రాలలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఇక ఈ బ్యూటీ 2003లో విడుదలైన తెలుగు సినిమా 'మిస్సమ్మ' సినిమాకు ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంది. 1978, ఆగష్టు 21న ఢిల్లీలో జన్మించిన భూమిక తన విద్యను కూడా అక్కడే పూర్తి చేసింది. చదువు పూర్తవగానే తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలో అవకాశాలను వెదుక్కుంటూ ముంబై చేరింది. ఆమె తండ్రి ఆశిష్ సింగ్ చావ్లా ఆర్మీ అధికారి. ఆమె సోదరుడు కూడా సైన్యంలోనే పనిచేస్తున్నాడు. మొదట్లో పాండ్స్ పౌడర్ ప్రకటనలో కనిపించిన భూమిక తరువాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక 2003లో విడుదలైన 'తేరేనామ్' సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించింది భూమిక. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా సీనియర్ హీరోలతో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్.. ఇలా అందరితో భారీ హిట్స్ అందుకుంది. ఆ తర్వాత ఆమె స్నేహితుడు, ప్రముఖ యోగా గురువైన భరత్ ఠాకూర్ ను 2007 లో వివాహం చేసుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మకు కవిత్వం అంటే చాలా ఇష్టమట. ఇక ఈ మద్యే నాని హీరోగా నటించిన 'ఎంసిఏ' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

ఇక ఇటీవలే తను సినిమా రంగంలోకి ప్రవేశించి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో.. సోషల్ మీడియా వేదికగా తన మనసులో మాటలు బయటపెట్టింది. ‘నేటితో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇరవై ఏళ్లు పూర్తి అవుతున్నాయి. నన్ను ఫస్ట్ నుండి ఆదరించి.. మీ అమితమైన ప్రేమను నాపై కురిపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన దేవుడుకి, నా శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీ విలువైన ప్రేమ వల్లే నేడు నేను ఈ స్థాయిలో ఉన్నాను' అంటూ కాస్త ఎమోషనల్ అయింది. ఏదేమైనా భూమిక తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం కావడం సంతోషించాల్సిన విషయం.