Begin typing your search above and press return to search.

ఇంకా షూటింగులోనే ఉంటే ఎట్లా 'భీమ్లా నాయక్'?

By:  Tupaki Desk   |   17 Dec 2021 8:30 AM GMT
ఇంకా షూటింగులోనే ఉంటే ఎట్లా భీమ్లా నాయక్?
X
భీమ్లా నాయక్' సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని పవన్ అభిమానులు వేయికళ్లతో వెయిట్ చేస్తుండగా, ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని దర్శక నిర్మాతలు ప్రకటించారు. జనవరి 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. దాంతో ఎప్పుడు వచ్చేదానికంటే ముందుగానే ఈ సారి సంక్రాంతి వస్తే బాగుండునని అభిమానులు అనుకుంటున్నారు .. ఆశ పడుతున్నారు. అయితే ఈ 'భీమ్లా నాయక్' మాత్రం కూల్ గా 'వికారాబాద్' ప్రాంతంలో షూటింగు జరుపుకుంటున్నాడు. ప్రస్తుతం అక్కడ ఈ సినిమా షూటింగు జరుగుతోంది.

ఆ ప్రాంతంలోని వాళ్లంతా పవన్ ను చూడటానికి పెద్ద సంఖ్యలో రావడంతో, ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. దాంతో అభిమానులంతా అదేంటి? ఈ సినిమా షూటింగు ఇంకా పూర్తి కాలేదా? ఇప్పుడు ఇంకా షూటింగు దశలోనే ఉంటే, ఈ సినిమాను జనవరికి థియేటర్లకు తీసుకురాగలుగుతారా? అనే డౌటు అభిమానుల్లో మొదలైంది. పవన్ పోర్షన్ ఇంకా పూర్తికాలేదు. ఈ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చనే ప్రచారం కొన్ని రోజుల పాటు జోరుగా కొనసాగింది. అయితే తమ సినిమా ముందుగా చెప్పిన తేదీకే వస్తుందని మేకర్స్ స్పష్టం చేశారు.

అయితే పవన్ పోర్షన్ పూర్తయిపోయి ఉంటుంది, రానా - సంయుక్త మీనన్ కాంబినేషన్లో సీన్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటిని సాధ్యమైనంత త్వరగా కానిచ్చేస్తారని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 7వ తేదీన 'ఆర్ ఆర్ ఆర్' ను థియేటర్స్ లో దింపుతున్నట్టుగా టీమ్ ప్రకటించింది. అయినా ఎంతమాత్రం 'భీమ్లా నాయక్' భయపడకపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కథాకథనాల పట్ల గల నమ్మకం .. పవన్ క్రేజ్ .. రానా ఇమేజ్ .. పండగ సీజన్ పై గల నమ్మకంతోనే ఈ సినిమా వెనక్కి తగ్గలేదని అంతా అనుకున్నారు.

కానీ ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ రోజున వికారాబాద్ - మదన్ పల్లిలో మొదలు కావడంతో, సంక్రాంతికి ఈ సినిమా వస్తుందా అనేది సందేహంగా మారింది. మరి వాళ్ల బెంగ తీర్చడం కోసం మేకర్స్ ఏం చెబుతారో చూడాలి. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటించగా , రానా జోడీగా సంయుక్త మీనన్ సందడి చేయనుంది. కీలకమైన పాత్రల్లో సముద్రఖని .. బ్రహ్మానందం కనిపించనున్నారు. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' అనే మలయాళ హిట్ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా, ఇక్కడ ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.