Begin typing your search above and press return to search.

పవన్ కు తప్పని లీకుల బెడద.. నెట్టింట చక్కర్లు కొడుతున్న 'భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లిమ్స్

By:  Tupaki Desk   |   14 Aug 2021 10:48 AM GMT
పవన్ కు తప్పని లీకుల బెడద.. నెట్టింట చక్కర్లు కొడుతున్న భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లిమ్స్
X
టాలీవుడ్ లో ఈ మధ్య 'లీకులు' అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే మన స్టార్ హీరోలు నటించే సినిమాలకు సంబంధించిన ప్రతీది ముందే నెట్టింట దర్శనమిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి టైటిల్ - టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ - షూటింగ్ క్లిప్పింగ్స్ వరకూ.. అన్నీ ముందే సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. ఫలానా సమయానికి అప్డేట్ ఇస్తున్నాం అని మేకర్స్ అధికారికంగా చెప్పడమే ఆలస్యం.. వెంటనే ఆ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇదంతా లీకు రాయుళ్ల పనేనా? లేదా యూనిట్ సభ్యులే కావాలని ఇలాంటి స్ట్రాటజీలు ప్లాన్ చేస్తున్నారా? అనే డిస్కషన్ కూడా ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో జరుగుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న 'PSPKRana' సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్ ను ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఒకరోజు ముందుగానే 'భీమ్లా నాయక్' టైటిల్ తో పాటుగా గ్లిమ్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. పవన్ పంచె కట్టులో రౌడీలను రఫ్ఫాడించే క్లిప్పింగ్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇంతకముందు కూడా షూటింగ్ లొకేషన్ నుంచి 30 సెకన్ల నిడివి ఉండే ఓ వీడియో బయటకు వచ్చింది. పవన్ - రానా వాగ్వాదానికి దిగుతున్న ఈ బిట్ లో నిత్యామీనన్ కూడా కనిపించడంతో.. మేకర్స్ చేసేదేమీ లేక అధికారికంగా హీరోయిన్ ని ప్రకటించారు.

ఇటీవల మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ ఇవ్వాలని 'సర్కారు వారి పాట' టీమ్ బర్త్‌ డే బ్లాస్టర్ అంటూ టీజర్ రెడీ చేసింది. ఉదయం విడుదల చేయాల్సిన ఈ టీజర్ ముందే లీక్ అవ్వడంతో.. అర్థరాత్రి హడావిడిగా బ్లాస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. అలానే ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్' షూటింగ్ స్పాట్ నుండి కొన్ని ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. ఫోటోలలో ప్రభాస్ - ప్రభాస్ శ్రీను కనిపించగా.. వీడియోలో నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఇదే క్రమంలో 'పుష్ప' నుంచి 'దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక' అనే ఫస్ట్ సాంగ్ ముందే లీకు రాయుళ్ల చేతికి చిక్కింది. నిన్న శుక్రవారం ఉదయం రిలీజ్ అవ్వాల్సిన ఈ సాంగ్ ను.. ముందు రాత్రే అందరూ విన్నారు. కాకపోతే అది ఒరిజినల్ సాంగ్ కాదు.. దేవిశ్రీ ప్రసాద్ పాడిన మ్యూజిక్ డైరెక్టర్ వెర్షన్. ఏదైతేనేం చెప్పిన సమయాని కంటే ముందే ఈ పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' సినిమా గ్లిమ్స్ లీక్ అయింది.

టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న చాలా బిగ్ మూవీస్ కు ఈ లీకులు బెడద వచ్చి పడింది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే మేకర్స్.. ఈ విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ లీకులనేవి అప్పుడప్పుడు సినిమాకు ప్లస్ అవుతుంటాయి.. మరికొన్నిసార్లు మైనస్ అవుతుంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఇది లీక్ రాయుళ్ల పని కాదు.. యూనిట్ సభ్యులే హైప్ కోసం కావాలని ప్లే చేసే ట్రిక్స్ అని కామెంట్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. అలానే తమ ప్రమోషనల్ కంటెంట్ రికార్డులను బ్రేక్ చేయకూడదని కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదైతేనేం స్టార్ హీరోల సినిమాల నుంచి ముందే ఇలాంటివి బయటకు రావడం వల్ల ఎగ్జైట్మెంట్ పోతోందని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.