Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్: గ‌బ్బ‌ర్ సింగ్ నే కెలికిన డేనియ‌ల్ ..

By:  Tupaki Desk   |   20 Sep 2021 12:58 PM GMT
టీజ‌ర్ టాక్: గ‌బ్బ‌ర్ సింగ్ నే కెలికిన డేనియ‌ల్ ..
X
భీమ్లా నాయ‌క్ వ‌ర్సెస్ డేనియ‌ల్ శేఖ‌ర్.. పోలీసాయ‌న‌కు ప‌వ‌ర్ ఫుల్ పెద్ద‌మ‌నిషికి మ‌ధ్య సాగిన వార్ లో ట్విస్టులేమిట‌న్న‌దే ఈ సినిమా. ఈగోలు పంతాలు ప‌ట్టింపుల‌తో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మోడ్ లో సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంది. భీమ్లా నాయ‌క్ .. అంటూ ప‌వ‌న్ పాత్ర‌ను హైలైట్ చేస్తూ టైటిల్ ని ఎంపిక చేయ‌గా అది ప‌వ‌న్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. భీమ్లా నాయ‌క్ పై టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా సునామీ స్పీడ్ తో దూసుకెళ్లింది.

అయితే రానా పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్య‌త ఉండ‌ద‌ని అంతా భావించారు. కానీ ఇప్పుడు అత‌డి పాత్ర ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తూ డేనియ‌ల్ శేఖ‌ర్ రోల్ పై గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. డేనియ‌ల్ గా రానా పాత్ర కూడా అంతే ప‌వ‌ర్ ఫుల్ గా సాగ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. అత‌డు పంచె క‌ట్టుతో పెద్ద మ‌నిషిలా క‌నిపించాడు. మీసం తిప్పుతూ క‌ళ్ల‌ద్దాలు స‌వ‌రిస్తూ స్టైలిష్ గా రెబ‌ల్ గా క‌నిపిస్తున్నాడు. జీప్ పై అత‌డి స‌వారీ ఆక‌ట్టుకుంటోంది.

``నీ మొగుడు గ‌బ్బర్ సింగ్ అంట.. స్టేష‌న్ లో టాక్ న‌డుస్తోంది! .. అంటూ డేనియ‌ల్ ప‌వ‌న్ వైఫ్ పై నిత్యా మీన‌న్ పై పంచులు విసురుతున్నాడు. ``నేనెవ‌రో తెలుసా? ధ‌ర్మేంద్ర .. హీరో!! డేనియ‌ల్ ఎంట‌ర్ టైన్ మెంట్ ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ వ‌న్`` అంటూ పంచ్ మీద పంచ్ వేశాడు. మొత్తానికి రానా అభిమానుల‌కు సంతృప్తిక‌ర‌మైన టీజ‌ర్ ఇద‌ని భావించాలి. భీమ్లా కు కౌంట‌ర్లు వేసే డేనియ‌ల్ క‌థేమిటో తెర‌పైనే చూడాలి.

మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్య‌ప్ప‌నుమ్ కోషియంలో పృథ్వీరాజ్ పోషించిన ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ను రానా పోషిస్తున్నాడు. ప‌వ‌న్ బిజుమీన‌న్ పోషించిన కాప్ రోల్ లో క‌నిపించ‌నున్నాడు. లోక‌లైజ్ చేసే క్ర‌మంలో గ‌బ్బ‌ర్ సింగ్ ని వాడేస్తున్నారు చిత్ర‌బృందం. తాజా టీజ‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. ఈ చిత్రానికి సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై నాగ‌వంశీ-పీడీవీ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. త్రివిక్ర‌మ్ మాట‌లు అందిస్తూ ద‌ర్శ‌క‌త్వ ప‌ర్యవేక్ష‌ణ చేస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం విడుద‌ల కానుంది.