Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నంగా మారిన భావ‌న క్వ‌శ్చ‌న్స్

By:  Tupaki Desk   |   3 April 2017 5:12 PM GMT
సంచ‌ల‌నంగా మారిన భావ‌న క్వ‌శ్చ‌న్స్
X
ఒక ప్ర‌ముఖ సినీ న‌టిని ఆమె డ్రైవ‌ర్ కిడ్నాప్ చేయ‌టం.. ఆపై లైంగిక వేధింపుల‌కు గురి చేయ‌టం లాంటివి సాధ్య‌మేనా? అంటే అవ‌కాశ‌మే లేద‌ని చెప్పేవారు. కానీ.. తెలుగు.. త‌మిళ‌.. మ‌ల‌యాళ న‌టి భావ‌నకు ఎదురైన చేదు ఉదంతం నేప‌థ్యంలో ఇలాంటివి జ‌ర‌గొచ్చ‌ని చెప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. యావ‌త్ దేశాన్ని దిగ్ర్భాంతికి గురి చేసిన ఈ ఉదంతంపై.. ధైర్యంగా గ‌ళం విప్పిన భావ‌న‌.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి.. ఇలాంటి అన్యాయాల్ని సిగ్గు ప‌డ‌కుండా బ‌య‌ట‌పెట్టాల‌న్న సందేశాన్ని ఇచ్చార‌ని చెప్పాలి.

ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె డ్రైవ‌ర్ మార్టిన్ తో పాటు.. ఈ దుర్మార్గానికి సూత్ర‌ధారిగా భావిస్తున్న ప‌ల్స‌ర్ సునిని పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర‌మైన షాక్ కు గురైన ఈ ఉదంతంపై భావ‌న కొన్ని వారాల పాటు మౌనంగా ఉండిపోయారు. తాజాగా ఒక మ‌ల‌యాళం మ్యాగ్ జైన్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆమె సంచ‌ల సందేహాల్ని బ‌య‌ట‌పెట్టారు. ఆమె సంధించే స‌వాళ్ల‌ను చూసిన‌ప్పుడు.. ఆమెకు జ‌రిగిన దారుణం వెనుక పెద్ద కుట్ర ఉంద‌న్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. సినిమా న‌టుల‌ను లొకేష‌న్ల‌కు తీసుకొచ్చే కారు డ్రైవ‌ర్ ఇంత దారుణానికి ఒడిగ‌ట్టగ‌ల‌డా? అస‌లు ఇదంతా ఎవ‌రు చేశారు? ఎందుకు చేశారు? కేవ‌లం డ‌బ్బుల కోస‌మే ఇలాంటివి చేశారంటే న‌మ్మ‌శ‌క్యంగా లేద‌న్నారు. త‌న‌ను తొలిచేస్తున్న సందేహాల‌కు స‌మాధానాలు దొరికే వ‌ర‌కూ తాన పోరాడుతూనే ఉంటాన‌ని.. వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు.

తాను అవ‌కాశాల కోసం దేబ‌రించ‌న‌ని.. చేయ‌ని త‌ప్పున‌కు క్ష‌మాప‌ణ‌లు అస్స‌లు చెప్ప‌న‌ని.. కావాలంటే అహంకారిగా ఉండేందుకైనా ఇష్ట‌ప‌డ‌తానే కానీ.. రాజీ పడే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో శాశ్విత స్నేహితులు కానీ.. శాశ్విత శ‌త్రువులు కానీ ఉండ‌ర‌ని చెబుతార‌ని.. కానీ.. త‌న విష‌యంలో శాశ్విత శ‌త్రువులు ఉన్నార‌న్నారు. త‌న‌కు జ‌రిగిన లాంటి దారుణాల విష‌యంలో మౌనంగా ఉండ‌కూడ‌ద‌న్న భావ‌న‌.. ఇత‌ర బాధితులు కూడా ధైర్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చి.. త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల గురించి గ‌ళం విప్పాల‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/