Begin typing your search above and press return to search.

నేను ఎవరన్నది తెలిసి భారతీరాజా భయపడిపోయారు!

By:  Tupaki Desk   |   19 April 2022 1:30 PM GMT
నేను ఎవరన్నది తెలిసి భారతీరాజా భయపడిపోయారు!
X
కొంతకాలం క్రితం తమిళంలో ఎం.ఆర్. రాధా గొప్ప నటుడు. హీరోగా .. విలన్ గా .. కేరక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అప్పట్లో స్టార్ హీరోగా ఎంజీఆర్ ఒక వెలుగు వెలుగుతున్నారు. ఒక రేంజ్ లో ఆయనకి ప్రేక్షకుల ఆదరణ లభిస్తూ ఉండేది. ఆ సమయంలోనే ఎంజీఆర్ కీ .. ఎమ్.ఆర్. రాధాకి మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉండేది. ఒకానొక సమయంలో ఒక షూటింగులో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న సంఘటన అప్పట్లో అందరినీ విస్మయానికి గురిచేసింది. తాజాగా ఆ విషయాన్ని గురించి 'ఆలీతో సరదాగా'లో రాధిక ప్రస్తావించారు.

"అప్పట్లో నాన్నగారికి ఎంజీఆర్ తో జరిగింది చాలా పెద్ద గొడవ. ఆ సంఘటనను నేను ఇప్పుడు సిరీస్ గా తీయబోతున్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై నుంచి హైదరాబాదులో షూటింగు మొదలవుతుంది. అప్పట్లో ఎంజీఆర్ కీ .. మా నాన్నగారికి మధ్య గొడవలు పెద్దవి కావడంతో మా మదర్ కంగారుపడిపోయింది. తన వైపు నుంచి ఆమె లీగల్ గా పోరాడాలి. మరో వైపున మా ప్రొటెక్షన్ చూసుకోవాలి. ఇది చాలా కష్టమైన పని అని చెప్పేసి, మమ్మల్ని తీసుకుని శ్రీలంక వెళ్లి అక్కడ హాస్టల్లో చేర్పించింది.

తన స్నేహితులైన ఒక ముస్లిమ్ ఫ్యామిలీకి అమ్మ మా బాధ్యతను అప్పగించింది. హాస్టల్లో మమ్మల్ని చదివిస్తూ ఆ ముస్లిమ్ ఫ్యామిలీ వారే మాకు గార్డియన్స్ గా ఉన్నారు. ఆ తరువాత లండన్ లో కొంతకాలం పాటు చదువుకున్నాను.

మా ఫాదర్ ని చూడటం కోసం నేను చెన్నై వెళ్లినప్పుడు భారతీరాజా గారు నన్ను తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. అప్పుడు ఆయనకి నేను ఎం.ఆర్. రాధా గారి కూతురుననే విషయం తెలియదు. ముందు రోజున నన్ను చూసి ఓకే అన్నారు .. ఆ మరుసటి రోజునే షూటింగు పెట్టారు. నన్ను తీసుకుని షూటింగు కోసం 'పొల్లాచ్చి' బయల్దేరారు.

అప్పుడు ఆయనకి తెలిసింది నేను ఎం.ఆర్. రాధాగారి కూతురునని. ఆ విషయం తెలియగానే ఆయన చాలా భయపడిపోయారు. ఎందుకొచ్చిన గొడవా అని చెప్పేసి ఆ తరువాత మా ఫాదర్ ను కలుసుకుని, నా విషయం చెప్పారు.

ఆయన నవ్వేసి .. 'రాధిక నటిస్తుందా?' అని ఆశ్చర్యపోయారట. ఆ తరువాత ఆయన నన్ను ఆశీర్వదించారు. నేను ఎం.ఆర్. రాధాగారి కూతురునే అయినప్పటికీ, నా స్వయంకృషితోనే పైకి వచ్చాను. బయట నుంచి చాలామంది చాలా కామెంట్లు చేస్తుంటారు. కానీ నటించడమనేది ఎంత కష్టమనేది నటించేవారికే తెలుస్తుంది" అని చెప్పుకొచ్చారు.